జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత...
- కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగరం శంకర్
యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో వాణిజ్య సముదాయాల సెల్లార్లు,బేస్‌మెంట్లను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారాలు,దుకాణాలు,కార్యాలయాలు, హోటళ్లు,గోడౌన్లకు అద్దెకు ఇస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నాగరం శంకర్ కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్‌రావుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా నాగరం శంకర్ మాట్లాడుతూ...భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో రోజు రోజుకూ వాణిజ్య సముదాయాల నిర్మాణం పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీ,భవన నిర్మాణ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాణిజ్య భవనాల్లోని సెల్లార్లు, బేస్‌మెంట్లను కేవలం వాహనాల పార్కింగ్ కోసమే వినియోగించాల్సి ఉండగా,కొందరు యాజమాన్యాలు వాటిని అక్రమంగా ఇతర అవసరాలకు అద్దెకు ఇస్తున్నారని ఆరోపించారు.సెల్లార్లలో వాహన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వల్ల ప్రధాన రహదారులు,రద్దీ కూడళ్లలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమవుతున్నాయని తెలిపారు. పాదచారులు,వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,ట్రాఫిక్ నియంత్రణ పోలీసులపై కూడా అదనపు భారం పడుతోందని పేర్కొన్నారు.అక్రమంగా సెల్లార్లను వినియోగిస్తున్న భవన యాజమాన్యాలపై ట్రాఫిక్,మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి
బహుళ అంతస్తుల వాణిజ్య భవనాల నిర్మాణ సమయంలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని నాగరం శంకర్ సూచించారు. వాహనాల రాకపోకలకు అనుకూలంగా సరైన ర్యాంపులు ఏర్పాటు చేయడంతో పాటు, అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజిన్లు సులభంగా చేరుకునేలా తగిన వెడల్పుతో మార్గాలు ఉండేలా చూడాలని కోరారు.బహుళ అంతస్తుల భవనాల నిర్మాణంలో మట్టి స్థిరత్వ పరీక్షలు,అగ్నిమాపక శాఖ అనుమతులు,ఎన్‌ఓసీ వంటి అంశాలను సంబంధిత అధికారులు పరిశీలించాలని అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భవనాల భద్రతను నిర్ధారించేందుకు అవసరమైన మాక్ డ్రిల్స్ నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.భువనగిరి మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణంలో ఉన్న,ఇప్పటికే నిర్మించిన వాణిజ్య సముదాయాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని నాగరం శంకర్ కోరారు.నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లు,బేస్‌మెంట్లను వినియోగిస్తున్న యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి,చట్టప్రకారం,చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు,ఇతర అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,మున్సిపల్,ట్రాఫిక్,ఫైర్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసేలా జిల్లా అధికారులు తగిన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి