రామన్నపేట, సెప్టెంబర్ 16: నిజాం నిరంకుశ పాలన, దొరలు–భూస్వాముల దోపిడీ, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం సాగించిన మహత్తర సాయుధ పోరాటాన్ని బీజేపీ మతాల మధ్య జరిగిన ఘర్షణగా చిత్రీకరిస్తూ చరిత్రను వక్రీకరిస్తోందని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య ఆరోపించారు. బుధవారం రామన్నపేటలో జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి, భుక్తి, విముక్తి కోసం రైతులు, కూలీలు, పేద ప్రజలు సాగించిన వీరోచిత ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటమని పేర్కొన్నారు.
ఈ పోరాటంలో వేలాది మంది ప్రజలు, ముఖ్యంగా కమ్యూనిస్టు ఉద్యమ కార్యకర్తలు ప్రాణత్యాగం చేశారని వీరయ్య తెలిపారు. సుమారు నాలుగు వేల మంది కమ్యూనిస్టులు అమరులయ్యారని, వారి త్యాగాలతో వెట్టి చాకిరీ, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం పెరిగిందన్నారు. బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌కు అప్పట్లో ఎలాంటి పాత్ర లేకపోయినా, నేడు చరిత్రకు మతపరమైన రంగు పులుముతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలు రాజకీయ ప్రయోజనాల కోసం అసలు చరిత్రను పక్కదారి పట్టిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ ప్రజల వీరోచిత పోరాట వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వాస్తవ చరిత్రను యువతకు తెలియజేయాలని వీరయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ. జహంగీర్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి