తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి..
పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకావిష్కరణ..
జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడి..
నల్గొండ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ పథకం నల్గొండ జిల్లాలోని అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూస్తూ, జిల్లాను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి, జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
1948 సెప్టెంబర్ 17న నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని, ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే అత్యంత కీలకమైందని గుర్తుచేశారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి వర్గానికి పెద్దపీట వేస్తోందన్నారు.
రైతన్నకు మా ప్రభుత్వం కొండంత అభయం..
రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని, ఇందులో భాగంగా జిల్లాలో 2,34,281 మంది రైతులకు రూ.2,005.01 కోట్లు జమ చేశామన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్ ఇస్తున్నామని, జిల్లాలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసి రూ.74.38 కోట్లు చెల్లించామని వివరించారు. గత యాసంగిలో 7.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి, 48 గంటల్లోనే రూ.1,829 కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. వరి సాగులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి పంజాబ్‌ను అధిగమించిందని హర్షం వ్యక్తం చేశారు.బ్రాహ్మణ వెళ్లేముల ప్రాజెక్టు భూసేకరణ 90% పూర్తయిందని, హెచ్‌ఎల్సీ, ఎల్ఎల్‌సీ ద్వారా యాసంగిలో 2.61 లక్షల ఎకరాలకు నీరందించామని చెప్పారు. డిండి హెడ్ రీచ్‌కు రూ.1,800 కోట్లు, ఎస్‌ఎల్‌బీసీ, నాగార్జునసాగర్ కాలువల లైనింగ్ పనులకు వందల కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామన్నారు.
మహిళ సాధికారతే ముఖ్య ఉద్దేశం..
మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తెలిపారు. 6 గ్యారెంటీల కింద ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే గ్యాస్ సిలిండర్, గృహజ్యోతి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. నల్గొండ ఎస్‌ఎల్‌బీసీ వద్ద రూ.3.50 కోట్లతో మహిళా పెట్రోల్ బంక్, రూ.2.50 కోట్లతో 'నీలగిరి మహిళ మార్ట్' పనులను ప్రారంభించినట్లు చెప్పారు.
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు..
నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని కడపర్తిలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, రూ.9.85 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంజీయూ పరిధిలో రూ.5 కోట్లతో లా కాలేజీ, రూ.6 కోట్లతో బీ-ఫార్మసీ కాలేజీ ప్రారంభమయ్యాయని, ఎస్‌ఎల్‌బీసీ వద్ద రూ.20 కోట్లతో నర్సింగ్ కళాశాల, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మించామని చెప్పారు. నకిరేకల్‌లో రూ.32 కోట్లతో 100 పడకల ఆసుపత్రి పనులు జరుగుతున్నాయన్నారు.
మౌలిక సదుపాయాలు - పరిపాలన సమర్థత..
జిల్లాలో మొదటి విడతగా రూ.459 కోట్ల వ్యయంతో 17,873 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇండ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. రూ.596 కోట్లతో నల్గొండ బైపాస్ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, విద్యార్థుల సౌకర్యార్థం సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాల వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించామని పేర్కొన్నారు. జిల్లాలో సాదా బైనామా కింద వచ్చిన 28,313 దరఖాస్తుల్లో 27,123 దరఖాస్తులను పరిష్కరించామని, కొత్త చట్టం కింద 40 గ్రామాల్లో రీ-సర్వే పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఘనంగా వేడుకలు - పురస్కారాల అందజేత..
ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వార్డు స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రూ.20 లక్షల బహుమతి సాధించిన నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, సిబ్బందికి మంత్రి చెక్కును అందజేసి అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్, అదనపు కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి