సమైక్య భారతానికి హైదరాబాద్ విమోచన పునాది
హైదరాబాద్ విమోచనం స్వతంత్ర భారత చరిత్రలో కీలక ఘట్టమని ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం నిర్వహించిన 79వ హైదరాబాద్ విమోచన దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
చరిత్రను గుర్తుచేసే రోజు కాదు..
విమోచన దినోత్సవం కేవలం ఓ చారిత్రక తేదీని స్మరించుకునే సందర్భం కాదని.. దేశ సమైక్యత, ప్రజాస్వామ్య విలువలు, భారత ప్రగతి ప్రస్థానాన్ని గుర్తుచేసే రోజని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. 1948 సెప్టెంబర్‌లో ఆపరేషన్ పోలో అనంతరం హైదరాబాద్ సంస్థానం భారత సమాఖ్యలో విలీనం కావడం కీలక పరిణామమన్నారు.
పటేల్ సేవలు చిరస్మరణీయం.
జాతీయ సమగ్రత కోసం సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి సదా స్మరణీయమన్నారు. వందలాది సంస్థానాలను భారత సమాఖ్యలో ఏకీకృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. హైదరాబాద్ విలీనం ద్వారా బలమైన, ఏకీకృత భారతానికి పటేల్ పునాది వేశారని పేర్కొన్నారు.
సామాన్యుల త్యాగాలు మరువలేం
హైదరాబాద్ విమోచన ఉద్యమంలో విద్యార్థులు, మేధావులు, రచయితలు, రైతులు, సామాజిక, రాజకీయ కార్యకర్తలు సహా సామాన్య ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు. అనేకమంది జైలు జీవితం, హింస, కష్టనష్టాలను ఎదుర్కొన్నారని గుర్తుచేశారు.
రామ్‌జీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమురం భీమ్ వంటి దేశభక్తులకు నివాళులర్పించారు. ప్రభుత్వాలు, ప్రముఖ నాయకులే చరిత్రను నిర్మించరు.. అన్యాయాన్ని ఎదిరించిన సామాన్యుల ధైర్యసాహసాలు కూడా చరిత్రను సృష్టిస్తాయని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి