మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి.!
మిల్లుల్లో ధాన్యం అన్లోడింగ్ వేగవంతం చేయాలి.!
NM Yadav
జాప్యం లేకుండా రోజూ 400 లారీలు దించేలా చూడాలి..
జిల్లాలో ఇప్పటివరకు 6.76 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు..
రైతులకు ఇబ్బంది లేకుండా అందరూ సమన్వయంతో పనిచేయాలి..
రైస్ మిల్లర్లు, అధికారుల సమీక్షలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశం..
నల్గొండ : కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని రైస్ మిల్లులలో ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అన్లోడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. శనివారం మిర్యాలగూడ సబ్ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి ఆయన పౌర సరఫరాల అధికారులు, రైస్ మిల్లుల యాజమాన్యాలతో ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియపై సుదీర్ఘంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 6 లక్షల 76 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేశామని తెలిపారు. రాబోయే రోజుల్లో మరో రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని అందుకు అనుగుణంగా మిల్లర్లు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. మిల్లుల్లో ప్రతిరోజూ కనీసం 400 లారీల ధాన్యాన్ని దించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హమాలీల కొరత రానివ్వద్దు..
అన్లోడింగ్ ప్రక్రియకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని అవసరమైతే సుదూర ప్రాంతాల నుంచి కూడా వారిని రప్పించాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయి ఖాళీగా ఉన్న ఐకేపీ కేంద్రాల హమాలీలను కూడా అన్లోడింగ్ పనులకు వినియోగించుకోవచ్చన్నారు. ధాన్యం దించిన వెంటనే ట్రక్ షీట్లను తీసుకెళ్లాలని, రైస్ మిల్లులు, లారీ ట్యాగింగ్ వంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే అధికారులు క్షేత్రస్థాయిలోనే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ధాన్యం రవాణా నిరంతరాయంగా సాగేందుకు మిర్యాలగూడ లారీ అసోసియేషన్ అదనంగా 50 లారీలను అందుబాటులో ఉంచాలని ప్రక్రియ పూర్తయ్యే వరకు సహకరించాలని కోరారు.
10 రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి కావాలి.. ఎస్పీ
లారీలు, హమాలీల కొరత తలెత్తకుండా ముందస్తు వ్యూహంతో ముందుకు వెళ్లాలి. ధాన్యం రవాణా అన్లోడింగ్ ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి. మిగిలిన ధాన్యాన్ని రాబోయే 10 రోజుల్లో పూర్తిగా లిఫ్టింగ్ (సేకరణ) చేయాలి. మిల్లులకు ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందిస్తుంది. ప్రభుత్వ శాఖలు, మిల్లర్లు, లారీ యాజమాన్యాలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వానికి సహకరించాలి.
ప్రభుత్వానికి మిల్లర్ల అసోసియేషన్ హామీ..
ధాన్యం సేకరణ, అన్లోడింగ్ ప్రక్రియలో ప్రభుత్వానికి తాము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సందర్భంగా అధికారులకు హామీ ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ ఆర్డీవో రమణారెడ్డి, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారి (డీఎస్ఓ) వెంకటేష్, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ (డీఎం) రాంపత్తి నాయక్, తహసిల్దార్ శ్రీనివాస్, మిల్లర్ల అసోసియేషన్ ప్రతినిధులు గౌరు శ్రీనివాస్, బాబి, నవీన్ శ్రీరామ్, పలువురు రైస్ మిల్లుల యజమానులు మరియు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి