పెండింగ్ కేసుల పరిష్కారం, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి:ఎస్పీ పరితోష్ పంకజ్
వార్షిక తనిఖీలలో భాగంగా ఈ రోజు (21.08.2026) జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్ హద్నూర్ పిఎస్, జహీరాబాద్ డిఎస్పీ కార్యాలయాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హద్నూర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, డీఎస్పీ సైదా నాయక్ తో కలిసి స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, సిబ్బంది కిట్ ఆర్టికల్స్, స్టేషన్ రికార్డుల నిర్వహణను పరిశీలించారు.పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న స్వాధీనపరచుకున్న లేదా కేసులకు సంబంధించిన వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.కేసు సంబంధిత ఆస్తులను కోర్టులో సబ్మిట్ చేసే వరకు జాగ్రత్తగా భద్రపరచాలని సూచించారు. స్టేషన్ రికార్డులను తనిఖీ చేస్తూ ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించాలని, మిస్సింగ్ కేసులు, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. ఆస్తి సంబంధిత నేరాలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను (క్రైమ్ ప్రోన్ ఏరియాలు) బ్లాక్ స్పాట్లుగా గుర్తించి, పగలు-రాత్రి బీట్ విధులలో నిఘా పెంచాలని ఆదేశించారు.సీసీటీఎన్ఎస్-2.0, పిటిషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్, టీఎస్-కాప్, హెచ్‌ఆర్‌ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ పోర్టల్, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్ వంటి సాఫ్ట్‌వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయి పట్టు సాధించి, నేరాల నియంత్రణలో సమర్థవంతంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. స్టేషన్ రికార్డులైన పార్ట్-1 నుండి పార్ట్-5 వరకు ఎలాంటి పెండింగ్ లేకుండా సీసీటీఎన్ఎస్-2.0లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని ఆదేశించారు.అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ.., స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడి, వారి సమస్యలను పరిష్కరిస్తామనే భరోసా కల్పించాలని సూచించారు. విలేజ్ పోలీసు అధికారులు తమకు కేటాయించిన గ్రామాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, గ్రామ పెద్దలు, యువతతో సత్సంబంధాలు కలిగి శాంతిభద్రతలకు సంబంధించి ముందస్తు సమాచారాన్ని సేకరించాలన్నారు. స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లు, సస్పెక్ట్ హిస్టరీ షీటర్ల వివరాలు తెలిసి ఉండాలని, పగలు, రాత్రి బీట్ విధులలో తనిఖీ చేస్తూ, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్‌డేట్ చేయాలన్నారు. పాపిలాన్ డివైస్ ను వినియోగిస్తూ, అనుమానిత వ్యక్తులను తనిఖీ చేస్తూ, వేలిముద్రలను ద్వారా పాత నేరస్తులను గుర్తించాలని సూచించారు.
మారుతున్న సమాజానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని, సిబ్బంది ప్రతి ఒక్కరూ అన్ని రకాల విధులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రతి ఒక్కరూ తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించినప్పుడే పోలీస్ శాఖకు మంచి పేరు వస్తుందని అన్నారు. డ్యూటీ పరంగా లేదా వ్యక్తిగతంగా ఎలాంటి సమస్యలు ఉన్నా నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. సిబ్బంది సంక్షేమం కోసం ఎస్ హెచ్ ఓ అవలంబిస్తున్న పనితీరు అభినందనీయం అన్నారు.అనంతరం జహీరాబాద్ డిఎస్పీ కార్యాలయాన్ని సందర్శించి, కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసులు, అత్యాచార కేసులు, డౌరీ డెత్ కేసుల్లో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రతి కేసులో చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అన్నారు. అదేవిధంగా ప్రతి నెల తప్పనిసరిగా కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాలను నిర్వహిస్తూ, అనుమానిత వ్యక్తులు, అనుమానాస్పద వాహనాలను గుర్తించి క చర్యలు తీసుకోవాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని, అధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న గ్రామాలలో రోడ్డు ప్రమాదాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. రోడ్డు ఇంజెనీరింగ్ లో లోపాలు ఉంటే ఎన్.హెచ్.ఎ తో మాట్లాడి మరమత్తుల దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నేరాల ఛేదనలో, నియంత్రణలో కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. జహీరాబాద్ ప్రాంతం ఇతర రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉండటం వలన అక్రమ రవాణ జరగానికి అవకాశం ఎక్కువ అని, రాష్ట్ర సరిహద్దులలో నిఘా కట్టుదిట్టం చేయాలని, నాకబంధి నిర్వహిస్తూ, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు సూచించడం జరిగింది.డిఎస్పీ కార్యాలయ, పోలీస్ స్టేషన్ రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. విధులలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డ్ లను ప్రకటించారు. ఈ వార్షిక తనిఖీల సందర్భంగా జిల్లా ఎస్పీ వెంబడి జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, జహీరాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమంతు, టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవి, సబ్ డివిజన్ ఎస్ఐ లు ఉన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి