ఏకపక్ష, అప్రజాస్వామిక వైఖరికి నిరసనగా నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఐలు ఆందోళన
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా అనుసరిస్తున్న ఏకపక్ష, అప్రజాస్వామిక, రాజకీయ పక్షపాత వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) నల్లగొండ జిల్లా కార్యదర్శి అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. బీసీఐ స్వతంత్రత, ప్రజాస్వామిక విలువలు, న్యాయవాదుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత చైర్మన్‌పై ఉందని ఆయన అన్నారు.
శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టు ఎదుట ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతుల శంకరయ్య మాట్లాడుతూ.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏ రాజకీయ పార్టీకి లేదా ప్రభుత్వానికి అనుబంధ సంస్థ కాదని, దేశంలోని న్యాయవాదులందరికీ ప్రాతినిధ్యం వహించే స్వతంత్ర చట్టబద్ధ సంస్థ అని పేర్కొన్నారు. అలాంటి సంస్థ అధికారిక పదవి, లెటర్‌హెడ్‌ను రాజకీయ ప్రకటనలకు ఉపయోగించడం సంస్థ స్వతంత్రతను, విశ్వసనీయతను దెబ్బతీసే చర్యగా ఆయన విమర్శించారు.
మనన్ కుమార్ మిశ్రా 14 సంవత్సరాలకు పైగా బీసీఐ చైర్మన్‌గా కొనసాగుతూ సంస్థలో అధికారాన్ని వ్యక్తిగతంగా కేంద్రీకరించడం ప్రజాస్వామిక వ్యవస్థకు విరుద్ధమని శంకరయ్య అన్నారు. బార్ కౌన్సిల్ వంటి చట్టబద్ధ సంస్థలో నిర్ణయాలు పారదర్శకంగా, ప్రజాస్వామిక పద్ధతిలో జరగాల్సిన అవసరం ఉందన్నారు. న్యాయవాదుల వృత్తి ప్రయోజనాలు, న్యాయవ్యవస్థ స్వతంత్రత, న్యాయ విద్య ప్రమాణాలను కాపాడటంలో బీసీఐ కీలక పాత్ర పోషించాల్సి ఉందని తెలిపారు.
నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ పట్టభద్రులను న్యాయవాదులుగా నమోదు చేయవద్దని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేయడం ఏకపక్ష, చట్టవిరుద్ధ చర్యగా ఆయన అభివర్ణించారు. కొంతమంది విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినందుకు మొత్తం బ్యాచ్‌ను శిక్షించే విధంగా నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ విలువలకు, న్యాయవాదుల చట్టం-1961 నిబంధనలకు విరుద్ధమని అన్నారు. అనంతరం ఆ ఆదేశాలను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పినప్పటికీ, విద్యార్థుల వృత్తిపరమైన భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టిన బాధ్యత నుంచి చైర్మన్ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర బార్ కౌన్సిళ్ల స్వతంత్రతలో జోక్యం చేసుకోవడం సరికాదన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన వ్యక్తులను నామినేషన్ల ద్వారా అధికార స్థానాల్లో నియమించడం, ఎన్నికల ఫలితాల అనంతరం సభ్యుల సంఖ్యను పెంచి ఓడిపోయిన అభ్యర్థులను కౌన్సిళ్లలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం ప్రజాస్వామిక సూత్రాలకు విరుద్ధమని శంకరయ్య ఆరోపించారు. ఇటువంటి చర్యలు న్యాయవాదులలో బార్ కౌన్సిళ్లపై ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని అన్నారు.
న్యాయ విద్య ప్రమాణాలు, న్యాయ కళాశాలల తనిఖీలు, అనుమతులు, విరాళాల సేకరణకు సంబంధించి వస్తున్న ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపించాలని ఐలు నాయకులు డిమాండ్ చేశారు. బీసీఐలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడంతోపాటు సంస్థ ప్రజాస్వామిక, స్వతంత్ర, చట్టబద్ధ స్వభావాన్ని కాపాడాలని కోరారు.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కోల్పోయిన గౌరవం, విశ్వసనీయత, ప్రజాస్వామిక స్వభావాన్ని పునరుద్ధరించేందుకు మనన్ కుమార్ మిశ్రా వెంటనే బీసీఐ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అనంతుల శంకరయ్య డిమాండ్ చేశారు. న్యాయవాదుల హక్కుల పరిరక్షణ కోసం ఐలు నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో ఐలు జిల్లా ఉపాధ్యక్షులు పందెనపల్లి బ్రహ్మచారి, జిల్లా నాయకులు డి. నర్సాజీ, భీమగాని గణేష్, ఎన్. రాములు, పి. శేఖర్, దుర్గాప్రసాద్, మురళీకృష్ణ, నాగరాజు, స్వామినాథ్, సతీష్, నితీష్, రతన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి