గాంధీ విగ్రహాలు కాదు విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వాలి రానున్న బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి – పల్లగొర్ల మోదీరాందేవ్
గాంధీ విగ్రహాలు కాదు విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవ్వాలి రానున్న బడ్జెట్‌లో విద్యారంగానికి రూ.50 వేల కోట్లు కేటాయించాలి – పల్లగొర్ల మోదీరాందేవ్
Editor Desk
విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని భువనగిరిలో మహాధర్నా
భువనగిరి: విద్యార్థులకు రావలసిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భువనగిరిలో వేలాది మంది విద్యార్థులు సోమవారం మహాధర్నా నిర్వహించారు. భువనగిరి బాయ్స్ ప్రభుత్వ కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణన్న, బీసీ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ ఆదేశాల మేరకు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, గుండెబోయిన శంకర్, వేముల అనిల్, ఉడతల సాయి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులకు రావలసిన వేల కోట్ల రూపాయల స్కాలర్షిప్, ఫీజు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బకాయిలు చెల్లించకపోవడంతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం భారీగా ఖర్చు చేసి విగ్రహాలు ఏర్పాటు చేయగలిగితే విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడానికి నిధులు ఎందుకు లేవని ప్రశ్నించారు. స్కాలర్షిప్లు అందక పరీక్షల సమయంలో విద్యార్థులు తీవ్ర అయోమయంలో పడుతున్నారని, ఫీజులు చెల్లించకపోతే హాల్‌టికెట్లు, సర్టిఫికెట్లు ఇవ్వబోమని కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని తెలిపారు.
రానున్న బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం రూ.50 వేల కోట్లు కేటాయించాలని, ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు చదివే విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించి, మెస్ ఛార్జీలు పెంచాలని, విదేశీ విద్య కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి విద్యార్థికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలని కోరారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సామాజికవేత్త బట్టు రామచంద్రయ్య, బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు గుండెబోయిన శంకర్, నాయకులు వేముల అనిల్, ఉడతల సాయి, ఎడ్ల మహాలింగం, దీపక్, ఉదయ్, ఆర్యన్, మానస, ఉదయ్ శ్రీ, రమాదేవి, వినూత్న, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి