చిక్కడు... దొరకడు. రామన్నపేట ఎంఈఓ!
చిక్కడు... దొరకడు. రామన్నపేట ఎంఈఓ!
Editor Desk
ఇన్‌చార్జి వ్యవస్థతో విద్యాశాఖ గాడితప్పిందా?
ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణపై విమర్శలు.
రామన్నపేట:
మండల విద్యాశాఖ కార్యాలయంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రామన్నపేట మండలంలోని ఎల్లంకి ప్రభుత్వ ఉన్నత పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు తంగేళ్ల సురేందర్ రెడ్డి కి ఇన్‌చార్జి మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ)గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తుండటంతో మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విద్యాశాఖ కార్యాలయానికి వచ్చే ప్రజలకు సరైన సమాచారం అందడం లేదని, కిందిస్థాయి అధికారులు సమయపాలన పాటించడం లేదని పలువురు వాపోతున్నారు. ఏ సమాచారం అడిగినా స్పష్టమైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజుల వసూళ్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి మామూళ్లు అందుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రైవేట్ పాఠశాలలపై విద్యాశాఖ నియంత్రణ కరువైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిలా ఉండగా, జూలై 27న సమాచారం హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద దరఖాస్తు సమర్పించినప్పటికీ, ఇప్పటి వరకు రిసీవ్డ్ కాపీ ఇవ్వలేదని దరఖాస్తుదారు ఆరోపించారు. "సెక్షన్ సిబ్బంది లేరు, ఆపరేటర్ లేరు" అనే కారణాలతో రిసీవ్డ్ ఇవ్వకుండా తిప్పుతున్నారని తెలిపారు. ఎంఈఓ శిక్షణలో ఉన్నారని, మూడు రోజులుగా కార్యాలయానికి రావడం లేదని సిబ్బంది చెబుతున్నట్లు పేర్కొన్నారు.
మండల విద్యాశాఖ కార్యాలయంలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణ జరిపి, ప్రజలకు పారదర్శక సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇంచార్జ్ ఎంఈఓ వివరణ
ఈ విషయంపై ఇన్‌చార్జి ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి ని ఫోన్‌లో సంప్రదించి వివరణ కోరగా, "నేను ప్రస్తుతం శిక్షణలో ఉన్నాను. మూడు రోజుల వరకు కార్యాలయానికి రాను. నేను వచ్చిన తర్వాతే ఆర్‌టీఐ దరఖాస్తుకు రిసీవ్డ్ ఇస్తాను. కార్యాలయంలో ఉన్న సిబ్బంది రిసీవ్డ్ స్టాంపు ఇవ్వరు. స్టాంపు వారి వద్ద ఉండదు. నేను వస్తాను కదా..." అని సమాధానం ఇచ్చారు.
అయితే, జూలై 27న సమర్పించిన ఆర్‌టీఐ దరఖాస్తుకు ఇప్పటి వరకు రిసీవ్డ్ ఇవ్వకపోవడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం హక్కు చట్టం ప్రకారం దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియ, కార్యాలయ నిర్వహణపై జిల్లా విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి