చౌటుప్పల్ పోలీసులకు రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదు
రెడ్డి సామాజిక వర్గాన్ని ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శాసనమండలి సభ్యుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రెడ్డి సంక్షేమ సంఘం చౌటుప్పల్ శాఖ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 05న నకిరేకల్‌లో జరిగిన సభ సందర్భంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ ‘క్యూ న్యూస్’ వేదికగా తీన్మార్ మల్లన్న రెడ్డి సమాజాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు. సమాజంలో వివిధ వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి, ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యల వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు.కుట్రపూరిత వ్యాఖ్యలు పునరావృతం కాకుండా ఆయనపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం నాయకులు టి. గౌతమ్ రెడ్డి, టి. భాస్కర్ రెడ్డి, బి. శ్రీనివాస్ రెడ్డి, ఎస్. శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి