రూరల్‌లో తన మార్క్ చూపిన సైదాబాబు.. టూ టౌన్‌కు కొత్త షెరీఫ్..!
రూరల్‌లో తన మార్క్ చూపిన సైదాబాబు.. టూ టౌన్‌కు కొత్త షెరీఫ్..!
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
గంజాయి, పేకాట, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం.. రౌడీషీటర్లపై 24 గంటల నిఘా.. ప్రజలకు భరోసా, నేరగాళ్లకు హెచ్చరిక
నల్లగొండ పట్టణంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కొత్త షెరీఫ్‌గా ఎస్.ఐ డి. సైదాబాబు బాధ్యతలు స్వీకరించడంతో పోలీసు వర్గాలతో పాటు స్థానికంగా కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. గతంలో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, నిజాయితీ, కఠిన నిర్ణయాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సైదాబాబు, ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ (ఎస్.హెచ్.ఓ)గా బాధ్యతలు చేపట్టడం నేరస్థుల్లో ఆందోళన, ప్రజల్లో భరోసాను పెంచిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేసిన కాలంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసింగ్ ద్వారా సైదాబాబు తనదైన ముద్ర వేశారు. కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడని అధికారిగా పేరుపొందిన ఆయన, ప్రజల సమస్యల పరిష్కారంలోనూ ప్రత్యేక శ్రద్ధ కనబరిచారని స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. దీంతో టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు ఆయన రాకపై ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు టూ టౌన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్.ఐ డి. సైదాబాబు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై రాజీ లేకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమాలకు ఏమాత్రం స్థానం లేదని స్పష్టం చేశారు.
ముఖ్యంగా యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు గంజాయి విక్రయాలు, మాదక ద్రవ్యాల రవాణా, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పేకాట స్థావరాలు, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ముఠాలు, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుమానాస్పద కదలికలపై పోలీసు సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తారని పేర్కొన్నారు.
టూ టౌన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్ల కదలికలపై 24 గంటల పాటు ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ఖాయమని హెచ్చరించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారు, నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌తో పాటు ఇతర చట్టాల కింద కూడా చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ప్రజల సహకారంతోనే సమాజంలో శాంతిభద్రతలను మరింత పటిష్ఠం చేయగలమని పేర్కొన్న సైదాబాబు, ఎలాంటి సమస్యలు ఎదురైనా ప్రజలు నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై తక్షణ స్పందన ఉంటుందని, బాధితులకు న్యాయం చేయడమే తమ ప్రధాన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకమైన, జవాబుదారీతనం కలిగిన పోలీసింగ్‌ను అమలు చేస్తామని పేర్కొన్నారు.
రూరల్‌లో దడ పుట్టించిన సైదాబాబు.. టూ టౌన్‌లోనూ ఉక్కుపాదమేనా..!!!
కొత్త ఎస్‌హెచ్‌ఓగా డి. సైదాబాబు బాధ్యతలు చేపట్టడంతో టూ టౌన్ పోలీసింగ్‌లో కొత్త మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్‌లో తనదైన మార్క్ చూపిన సైదాబాబు, టూ టౌన్‌లో కూడా అదే క్రమశిక్షణ, అదే కఠినత్వంతో ముందుకెళ్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ, నేరగాళ్లకు హెచ్చరికలు జారీ చేస్తూ టూ టౌన్‌లో కొత్త పోలీసింగ్‌కు శ్రీకారం చుట్టిన సైదాబాబు నాయకత్వంలో శాంతిభద్రతలు మరింత బలోపేతం అవుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి