Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గోరంట్ల : చెట్టుకు ఉరివేసుకుని యువకుడి మృతి సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 20, 2026 12:13 PM

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి: CITU

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి: CITU

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.. ఆశాలకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి: CITU
June 20, 2026 10:20 AM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

పెండింగ్ పారితోషికాలతో తీవ్ర ఇబ్బందులు.. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాలు తప్పవని సీఐటీయూ హెచ్చరిక

అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను తక్షణమే అమలు చేసి, ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రానున్న పోరాటాలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

శుక్రవారం నల్లగొండలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.డి. సలీం, జిల్లా ఉపాధ్యక్షులు లకపాక రాజు, జిల్లా సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు మాట్లాడుతూ ఆశా వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఆశా వర్కర్లకు నెలల తరబడి పారితోషికాలు పెండింగ్‌లో ఉండటంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. కుటుంబ అవసరాల కోసం అప్పులు చేసి, బ్యాంకు ఈఎంఐలు చెల్లించలేక అనేక మంది ఆశా వర్కర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెలకు సంబంధించిన పారితోషికాలను అదే నెలలో, ముఖ్యంగా ప్రతి నెల ఒకటో తేదీ లోపు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గత రెండు దశాబ్దాలుగా ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ కీలక పాత్ర పోషిస్తున్నారని, వారిలో అధిక శాతం మంది మహిళలే కాకుండా బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారేనని తెలిపారు. అయినప్పటికీ వారికి ఎలాంటి చట్టబద్ధమైన ఉద్యోగ భద్రత లేకపోవడం, కనీస గ్యారంటీ వేతనం కూడా లేకపోవడం బాధాకరమన్నారు.

ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులపాటు నిరవధిక సమ్మె నిర్వహించారని గుర్తు చేశారు. ఆ సమయంలో అప్పటి ప్రభుత్వం పలు హామీలు ఇచ్చిందని, అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా హామీల అమలులో పురోగతి కనిపించడం లేదని విమర్శించారు. ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు రూ.50 లక్షల బీమా సౌకర్యం, మరణించిన సందర్భంలో రూ.50 వేల అంత్యక్రియల ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ, ఏరియర్స్, లెప్రసీ విధులు, ఎన్నికల డ్యూటీకి సంబంధించిన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఆశా వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, సమస్యలను నిర్లక్ష్యం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు మహేశ్వరి, కవిత, నాయకులు సైదమ్మ, పార్వతమ్మ, రాధిక, మణెమ్మ, స్వర్ణ, ఇందిరా, అనిత, సరిత తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News