రేపే 'నీట్' రీ ఎగ్జామ్ నల్గొండలో పటిష్ట బందోబస్తు.!
రేపే 'నీట్' రీ ఎగ్జామ్ నల్గొండలో పటిష్ట బందోబస్తు.!
NM Yadav
పరీక్షా కేంద్రాల వద్ద 'బీఎన్ఎస్ఎస్' సెక్షన్-163 అమలు..
మధ్యాహ్నం 1:30 దాటితే నో ఎంట్రీ జిరాక్స్ సెంటర్లు బంద్..
నల్గొండ టౌన్ : జిల్లాలో ఆదివారం (జూన్ 21) జరగనున్న 'నీట్ (UG)-2026' పునఃపరీక్షను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ (IPS) ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అడిషనల్ ఎస్పీ వెల్లడించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి అవకతవకలు, భద్రతా లోపాలకు తావులేకుండా ప్రతి అధికారి, సిబ్బంది అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ స్పష్టం చేశారు.
కేంద్రాల వద్ద భారీ నిఘా 163 సెక్షన్ అమలు..
జిల్లా వ్యాప్తంగా మొత్తం 7 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల వద్ద తగిన సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. పరీక్ష సజావుగా సాగేందుకు కేంద్రాల పరిసర ప్రాంతాల్లో బీఎన్ఎస్ఎస్ (BNSS) సెక్షన్-163 అమలు చేస్తున్నట్లు అడిషనల్ ఎస్పీ ప్రకటించారు. పరీక్షా కేంద్రాల సమీపంలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం నిషిద్ధం. అభ్యర్థులు మినహా ఇతరులు పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా సంచరించకూడదు. ధర్నాలు, ఆందోళనలకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. పరీక్ష జరిగే రోజున నల్గొండ జిల్లా కేంద్రంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేయాలి. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు నిర్దేశిత సమయం కంటే ముందుగానే చేరుకోవాలి. మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా కేంద్రంలోనికి అనుమతించేది లేదు. నిబంధనల ప్రకారం అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. అనధికార వ్యక్తుల ప్రవేశంపై పూర్తిగా నిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ ఏర్పడకుండా ప్రత్యేక ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. విద్యార్థులు సకాలంలో చేరుకునేలా రవాణా శాఖతో సమన్వయం చేసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాసేందుకు జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలా సహకరిస్తుందని అడిషనల్ ఎస్పీ భరోసా ఇచ్చారు. ఈ సమీక్షా సమావేశంలో నల్గొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి, టూ టౌన్ సీఐ రాఘవరావు, వన్ టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, నార్కట్‌పల్లి సీఐ సురేష్, పలువురు ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి