డీజీపీని కోరిన విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర కమిటీ
హైదరాబాద్: దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పోలీస్ శాఖలో పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించింది. చట్టం అమల్లోకి వచ్చి పదేళ్లు పూర్తవుతున్నప్పటికీ దివ్యాంగులకు పూర్తిస్థాయిలో హక్కులు, అవకాశాలు అందడం లేదని ఫోరం ప్రతినిధులు డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు.
ప్రభుత్వ ఉద్యోగాల్లో బెంచ్‌మార్క్ దివ్యాంగులకు చట్ట ప్రకారం 4 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, పోలీస్ శాఖలో దివ్యాంగులకు అనుకూలమైన పరిపాలనా, సాంకేతిక, కార్యాలయ పోస్టులను గుర్తించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఇప్పటికే ఉన్న బ్యాక్‌లాగ్ ఖాళీలను ప్రత్యేక నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో దివ్యాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్లు 89, 91, 92పై అవగాహన కల్పించే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదుల కోసం వచ్చే దివ్యాంగులకు వారి వైకల్యానికి అనుగుణంగా సహాయం అందించేలా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. అవసరమైన చోట సైన్ లాంగ్వేజ్ ఇంటర్‌ప్రెటర్, సహాయక వ్యక్తి, అందుబాటులో ఉండే ఫిర్యాదు విధానం వంటి సౌకర్యాలు కల్పించాలని కోరారు.
అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి ‘దివ్యాంగుల హక్కులు–పోలీసుల బాధ్యతలు’ అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలని, ప్రతి పోలీస్ కార్యాలయంలో దివ్యాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్లలో దివ్యాంగుల సౌకర్యార్థం ర్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు.
దివ్యాంగులపై వివక్ష, అవమానం, వేధింపులు, దౌర్జన్యాలు, హింసను అరికట్టేందుకు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఫోరం ప్రతినిధులు కోరారు. దివ్యాంగుల సమస్యలను తెలుసుకునేందుకు ప్రత్యేక సమయం కేటాయించి నెలకు ఒకసారి వారితో సమావేశం నిర్వహించాలని డీజీపీని విజ్ఞప్తి చేశారు.
దివ్యాంగుల హక్కుల చట్టం–2016ను పోలీస్ శాఖలో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని డీజీపీ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారని ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎన్. అశోక్ తెలిపారు. దివ్యాంగులకు రక్షణ, గౌరవం, సమానత్వం, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ పోలీస్ శాఖ దేశానికి ఆదర్శంగా నిలవాలని కోరినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఫోరం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మారవేణి చంద్రశేఖర్ యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్షిద్ మియా, మహిళా అధ్యక్షురాలు ధనమ్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శి వేణుగోపాల్ రెడ్డి, ఫోరం సభ్యుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి