పట్టించుకోని విద్యాశాఖ నేడు డీఈఓ కార్యాలయం ఎదుట TSUTF నిరసన..
నల్లగొండ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతుల నిర్వహణ కోసం ఎంపిక చేసిన సిబ్బందికి వెంటనే నియామక ఉత్తర్వులు అందజేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (TSUTF) నల్లగొండ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం జిల్లా అధ్యక్షుడు బక్కా శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఎంపిక చేసిన 124 పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించేందుకు విద్యాశాఖ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. అనంతరం మెరిట్ జాబితాను సైతం విడుదల చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయకపోవడం శోచనీయమన్నారు.
రెండు నెలలైనా స్పందన ఏదీ?
పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ప్రీ ప్రైమరీ ఉపాధ్యాయులు, ఆయాల నియామకాలు పూర్తి చేయకపోవడంతో ఆయా పాఠశాలల్లో చిన్న పిల్లల బోధన, నిర్వహణ తీవ్రంగా ప్రభావితమవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం (ఆగస్టు 21) ఉదయం 11 గంటలకు నల్లగొండ జిల్లా విద్యాశాఖాధికారి (DEO) కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ ధర్నా కార్యక్రమానికి ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమైన పాఠశాలల ఉపాధ్యాయులు, మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులు మరియు TSUTF బాధ్యులు, సభ్యులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి