నల్లగొండ జిల్లా అభివృద్ధికి రూ. 3,000 కోట్లు...
శ్రీరామాలయ మండపంలో ప్రత్యేక పూజలు...
నల్లగొండ : వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, శాంతియుతంగా, మతసామరస్యంతో జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. వినాయక చవితి పండగను పురస్కరించుకుని నల్లగొండ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం నల్లగొండ పట్టణంలోని రామాలయం వద్ద ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నల్లగొండ పట్టణంలో గత 30 ఏళ్లుగా ప్రజలు కులమతాలకు అతీతంగా, మతసామరస్యాన్ని కాపాడుకుంటూ వినాయక ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటున్నారని కొనియాడారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈ ఏడాది కూడా ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఎల్-నీనో ప్రభావం కారణంగా నెలకొన్న కరువు పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాలని, రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు, ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా దీవించాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు చెప్పారు.
రోడ్ల విస్తరణ కు పెద్దపీట...
తెలంగాణవ్యాప్తంగా రహదారుల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని మంత్రి వివరించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు కేటాయించగా, ఒక్క నల్లగొండ జిల్లాకే రూ.3,000 కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేపడుతున్నామని వెల్లడించారు. మారుమూల ప్రాంతాలకు సైతం మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. పారిశ్రామిక అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేలా రహదారులను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఆర్డీఓ అశోక్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ గుమ్మల మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు మామిడి కార్తీక్, వేణుగోపాల్ రెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, యమా దయాకర్, వినాయక మండలి కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి