రాములబండ వద్ద రూ.107 కోట్ల రోడ్డు పనులకు శంకుస్థాపన...
రూ.25 వేల కోట్లతో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి...
నల్లగొండ : శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్‌బీసీ) సొరంగ మార్గం పనులను 2028 జూలై నాటికి పూర్తి చేసి, నల్లగొండ జిల్లా రైతులకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దడమే తన ధ్యేయమని పేర్కొన్నారు. సోమవారం నల్లగొండ మండలం రాములబండ సమీపంలో రూ.107 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. న్యం రోడ్డు నుంచి దొనకల్లు ఎక్స్ రోడ్డు మీదుగా రాములబండ, కొండారం, అప్పాజీపేట, అన్నపర్తి వరకు రూ.75 కోట్లతో చేపట్టే రోడ్డు పనుల టెండర్లు పూర్తయ్యాయని, నాలుగు రోజుల్లో పనులు ప్రారంభించి దసరా కానుకగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే 30 ఏళ్ల అవసరాలకు తగినట్లుగా నాణ్యతతో రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో రూ.850 కోట్లతో గ్రామీణ రహదారులను అభివృద్ధి చేస్తున్నామని, రాష్ట్రవ్యాప్తంగా రూ.25,000 కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
విద్య, సంక్షేమానికి పెద్దపీట...
ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గం పనుల్లో ఇప్పటికే 600 మీటర్ల పురోగతి సాధించామని, అవసరమైన రూ.2,000 కోట్ల అదనపు నిధులను సీఎం రేవంత్ రెడ్డి ద్వారా మంజూరు చేయించి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటికే బ్రాహ్మణవెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేశామని గుర్తుచేశారు. నియోజకవర్గంలో దోమలపల్లి వద్ద రూ.10 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్, ఎస్ఎల్‌బీసీ సమీపంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూల్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, దొడ్డు బియ్యం స్థానంలో రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఈ మోహన్, ఆర్డీవో అశోక్ రెడ్డి, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ నాయక్, ఆర్ అండ్ బీ డీఈ గణేష్, ఏఈ వెంకట రమేష్, పీఆర్ డీఈ రమేష్, మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, సర్పంచ్ చామకూరి శంకర్, సెక్రటరీ విటల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి