కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స
కోతలేని ‘పోయం’ చికిత్సతో అకాలేషియా బాధితులకు కొత్త ఆశ నల్గొండ మహిళకు యశోదా ఆస్పత్రిలో విజయవంతమైన చికిత్స
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
నోటి ద్వారానే ఆధునిక ఎండోస్కోపీతో శస్త్రచికిత్స
ఆహారం మింగడంలో ఇబ్బంది, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని వైద్యుల హెచ్చరిక
ప్రారంభ దశలో గుర్తిస్తే అకాలేషియా కార్డియాపై సమర్థవంతమైన నియంత్రణ
మలక్‌పేట్ యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో విజయవంతంగా ‘పోయం’ చికిత్స
ఆహారం మింగడంలో ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, ఛాతీలో అసౌకర్యం, కారణం లేకుండా బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయరాదని, ఇవి అకాలేషియా కార్డియా అనే అరుదైన అన్నవాహిక వ్యాధికి సంకేతాలు కావచ్చని యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు తెలిపారు. ఈ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి ఆధునిక పెర్–ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (POEM) చికిత్స అందిస్తే పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే పూర్తిస్థాయిలో ఉపశమనం పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బుధవారం నల్గొండ పట్టణంలోని శాలిని రెస్టారెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నల్గొండకు చెందిన 52 ఏళ్ల మహిళకు మలక్‌పేట్‌లోని యశోదా ఆస్పత్రిలో పోయం విధానంలో విజయవంతంగా చికిత్స అందించిన విషయాన్ని వివరించారు.
వైద్యుల కథనం ప్రకారం, సదరు మహిళ కొంతకాలంగా ఆహారం మింగడంలో తీవ్ర ఇబ్బంది, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, ఛాతీలో అసౌకర్యం, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు టైప్–2 అకాలేషియా కార్డియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. అనంతరం గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు ఎలాంటి బాహ్య కోతలు లేకుండా నోటి ద్వారానే నిర్వహించేపోయం చికిత్స చేపట్టగా, ఆమె ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని తెలిపారు.
అకాలేషియా కార్డియా అంటే ఏమిటి?
అన్నవాహిక దిగువ భాగంలోని కండరాలు సరిగా సడలకపోవడం వల్ల ఆహారం, ద్రవాలు కడుపులోకి సులభంగా వెళ్లకపోవడాన్ని అకాలేషియా కార్డియా అంటారు. దీనివల్ల రోగులు ఆహారం మింగలేకపోవడం, తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం, ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం, బరువు తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వ్యాధి అరుదుగా కనిపించినప్పటికీ, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే పూర్తిగా నియంత్రించవచ్చని వైద్యులు వివరించారు.
‘పోయం’ చికిత్స ప్రత్యేకత ఇదే
పెర్–ఓరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (POEM) అనేది అత్యాధునిక ఎండోస్కోపీ విధానం. ఇందులో శరీరంపై ఎలాంటి కోతలు వేయకుండా, నోటి ద్వారానే ప్రత్యేక ఎండోస్కోపిక్ పరికరాలను ఉపయోగించి అన్నవాహికలో ఆహారం వెళ్లకుండా అడ్డుపడుతున్న కండరాలను లోపలి నుంచి విడదీస్తారు. దీంతో ఆహారం మళ్లీ సాధారణంగా కడుపులోకి చేరుతుంది.
ఈ చికిత్సలో నొప్పి తక్కువగా ఉండటంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు తెలిపారు. శరీరంపై ఎలాంటి మచ్చలు ఉండవని, ఆస్పత్రిలో కూడా తక్కువ రోజులు మాత్రమే ఉండాల్సి వస్తుందని చెప్పారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా అకాలేషియా చికిత్సలో ఈ విధానం విస్తృతంగా అమలవుతోందని వివరించారు.
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి
- ఆహారం లేదా ద్రవాలు మింగడంలో ఇబ్బంది
- తిన్న ఆహారం తిరిగి నోటికి రావడం
- ఆహారం మింగిన తర్వాత ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం
- కారణం లేకుండా బరువు తగ్గడం
- తరచూ ఆహారం గొంతులో ఇరుక్కుపోవడం లేదా ఉక్కిరిబిక్కిరి కావడం
ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులను సంప్రదించాలని వైద్యులు సూచించారు.
ప్రారంభ దశలో చికిత్సే ఉత్తమ పరిష్కారం: ఈ సందర్భంగా యశోదా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణుడుడా. కిషస్ నున్వత్స (ఎంబీబీఎస్, ఎండీ–జనరల్ మెడిసిన్, డీఎం–గ్యాస్ట్రోఎంటరాలజీ) మాట్లాడుతూ, అకాలేషియా కార్డియా చికిత్సలో పోయం విధానం ప్రపంచవ్యాప్తంగా అత్యంత సమర్థవంతమైన చికిత్సగా గుర్తింపు పొందిందన్నారు. పెద్ద శస్త్రచికిత్స అవసరం లేకుండానే రోగులకు దీర్ఘకాలిక ఉపశమనం లభిస్తుందని తెలిపారు. ఆహారం మింగడంలో ఇబ్బంది వంటి లక్షణాలను చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేయకుండా ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని సూచించారు. యశోదా ఆస్పత్రిలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇలాంటి అరుదైన వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని ఆయన వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి