ఉద్యోగాల భర్తీయే లక్ష్యం.. ప్రభుత్వానికి నిరుద్యోగ యువత ఆరు ప్రధాన డిమాండ్లు
ఉద్యోగాల భర్తీయే లక్ష్యం.. ప్రభుత్వానికి నిరుద్యోగ యువత ఆరు ప్రధాన డిమాండ్లు
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లకే తగ్గించాలి
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పదవీ విరమణ వయస్సు తగ్గింపు, నిరుద్యోగ భృతి అమలు, బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, టీజీపీఎస్సీ ప్రక్షాళన వంటి పలు అంశాలపై ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకోవాలని కోరింది.
నిరుద్యోగ యువత విడుదల చేసిన డిమాండ్లలో ముఖ్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచిన నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరారు. ఆ నిర్ణయం వల్ల కొత్త ఉద్యోగాల కల్పనకు ఆటంకం ఏర్పడిందని, నిరుద్యోగ యువత అవకాశాలు కోల్పోయిందని పేర్కొన్నారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పదవీ విరమణ వయస్సును మళ్లీ 58 సంవత్సరాలకు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ లక్ష్యాన్ని సాధించేందుకు వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా సీసీఎల్ఏ (CCLA) ద్వారా 5,944 జీపీవో పోస్టులను, తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (TSLPRB) ద్వారా 7,400 కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టులను కలిపి మొత్తం 14,742 పోస్టుల వరకు పెంచి నియామకాలు చేపట్టాలని కోరారు. అలాగే 1,393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) పోస్టులతో పాటు 25 వేల డీఎస్సీ ఉపాధ్యాయ పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టీజీపీఎస్సీ ద్వారా గ్రూప్–1లో 500 పోస్టులు, గ్రూప్–2లో వెయ్యి పోస్టులు, గ్రూప్–3లో మూడు వేల పోస్టులు, గ్రూప్–4లో పదివేలకుపైగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ ప్రారంభించాలని యువత కోరింది. ప్రభుత్వ శాఖల్లో దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న పోస్టులను దశలవారీగా కాకుండా ఒకేసారి భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
అదేవిధంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీలకు సంబంధించిన బ్యాక్‌లాగ్ పోస్టులను ప్రత్యేకంగా గుర్తించి తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా రిజర్వేషన్ హక్కులను పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ప్రతి నిరుద్యోగ యువకుడికి, ఉద్యోగం లభించే వరకు నెలకు రూ.5,016 చొప్పున నిరుద్యోగ భృతి అందించాలని విజ్ఞప్తి చేశారు. జీవనోపాధికి తోడ్పడటంతో పాటు ఉద్యోగాల కోసం సిద్ధమయ్యే యువతకు ఇది ఆర్థిక భరోసాగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
టీజీపీఎస్సీ వ్యవస్థపై అభ్యర్థుల్లో విశ్వాసం పెంపొందించేందుకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి సంస్థను ప్రక్షాళన చేయాలని, యూపీఎస్సీ తరహాలో పారదర్శకంగా, స్వతంత్రంగా పనిచేసే విధంగా పునర్వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. నియామక ప్రక్రియలో పారదర్శకత, సమయపాలన, విశ్వసనీయతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.
నిరుద్యోగ యువత లేవనెత్తిన ఈ డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి యువతకు ఉపాధి అవకాశాలే ప్రధాన బలమని, ఖాళీ పోస్టులను భర్తీ చేయడం ద్వారా పాలన మరింత సమర్థవంతంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి