ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్..
ఇద్దరు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్ట్..
NM Yadav
రూ. 52 లక్షల విలువైన గంజాయి సీజ్..
లారీలో గుట్టుగా తరలిస్తుండగా కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద పట్టుకున్న కేతేపల్లి పోలీసులు..
వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్..
నకిరేకల్/కేతేపల్లి : జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు సాగిస్తున్న తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుబడింది. ఒడిశా నుంచి ముంబైకి లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 104.5 కేజీల గంజాయిని కేతేపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ కేసు వివరాలను వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు ముమ్మరం చేయగా, విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ దిశగా భారీగా గంజాయి తరలుతుందన్న విశ్వసనీయ సమాచారంతో కేతేపల్లి ఎస్.ఐ సతీష్ తన సిబ్బందితో కలిసి కొర్లపహాడ్ టోల్ ప్లాజా వద్ద నిఘా పెట్టారు.
శనివారం ఉదయం 9:30 గంటల సమయంలో సూర్యాపేట వైపు నుంచి వస్తున్న హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ కలిగిన అశోక్ లేలాండ్ లారీని పోలీసులు అడ్డుకున్నారు. తనిఖీలు చేయడానికి ప్రయత్నించగా లారీలోని ఇద్దరు వ్యక్తులు పరారయ్యేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. లారీ వెనుక భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా నాలుగు ప్లాస్టిక్ బస్తాల్లో ప్యాక్ చేసి ఉన్న 103 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. క్లూస్ టీమ్ సమక్షంలో నిర్వహించిన తనిఖీల్లో 104.5 కేజీల గంజాయి ఉన్నట్లు నిర్ధారించారు. దీని విలువ మార్కెట్‌లో సుమారు రూ. 52.5 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. గంజాయితో పాటు లారీని, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో జమ్మూకు చెందిన లారీ డ్రైవర్ పరంవిర్ సింగ్, ముంబైకి చెందిన పెయింటర్ షా అలం పర్వేష్ ఆలం అన్సారిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ముఠా ప్రధాన సూత్రధారులు బిక్రం సింగ్, ఫరూక్, కేదర్ ప్రధాన్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు ఎస్పీ వివరించారు.
నిందితుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైకి చెందిన ఫరూక్ అనే వ్యక్తి గతంలో జమ్మూ జైలులో ఉన్నప్పుడు పరంవిర్ సింగ్‌తో పరిచయం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వీరంతా ముఠాగా ఏర్పడి, ఒడిశాలోని గంజం జిల్లా అడవుల నుంచి తక్కువ ధరకే గంజాయిని సేకరించి ముంబైకి తరలిస్తున్నారు. గతంలో రెండుసార్లు విజయవంతంగా రవాణా చేసిన వీరికి, ఈసారి పెద్ద మొత్తంలో గంజాయిని తరలిస్తే లక్ష రూపాయలు ఇస్తామని ప్రధాన నిందితుడు ఆశ చూపాడు. ఈ క్రమంలోనే రాజమండ్రి, ఖమ్మం మీదుగా హైదరాబాద్ వెళ్తుండగా పోలీసులకు చిక్కారు. సకాలంలో స్పందించి అంతర్రాష్ట్ర ముఠాను పట్టుకున్న నకిరేకల్ సీఐ హరిబాబు, కేతేపల్లి ఎస్.ఐ సతీష్, సిబ్బంది బి. వెంకటేశ్వర్లు, వెంకట కృష్ణ, స్వామి, వెంకన్న, బాసిత్‌లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. యువత భవిష్యత్తును చిన్నాభిన్నం చేస్తున్న మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి