నకిలీ ‘స్పౌజ్’ సర్టిఫికేట్‌తో బదిలీ ప్రయోజనం?
నకిలీ ‘స్పౌజ్’ సర్టిఫికేట్‌తో బదిలీ ప్రయోజనం?
NM Yadav
స్పౌజ్' బదిలీల్లో నకిలీ బాగోతం.!
డిస్ట్రిక్ట్ కలెక్టర్‌కు ఏఎన్ఎం సుజాత ఫిర్యాదు..
డీఎంహెచ్‌ఓ ఆఫీస్ సూపరింటెండెంట్‌పై తీవ్ర ఆరోపణలు..
అర్హులకు అన్యాయం సమగ్ర విచారణకు డిమాండ్..
నల్గొండ : ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియలో అక్రమాలు కలకలం రేపుతున్నాయి. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసుకునేందుకు ప్రభుత్వం కల్పించిన ‘స్పౌజ్’ (Spouse) ప్రాధాన్యతను కొందరు అడ్డదారిలో వాడుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓ అధికారిక హోదాలో ఉన్న వ్యక్తి అండతో నకిలీ భార్యాభర్తల ధ్రువీకరణ పత్రాన్ని సృష్టించి, బదిలీ ప్రయోజనం పొందారంటూ బాధితురాలైన ఓ ఏఎన్ఎం ఏకంగా జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేయడం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నకిలీ సర్టిఫికేట్ల కారణంగా అర్హురాలైన తనకు తీవ్ర అన్యాయం జరిగిందని సదరు మహిళా ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు.
అసలేం జరిగిందంటే..?
ఫిర్యాదుదారు ఐ. సుజాత గతంలో నాగార్జునసాగర్‌లోని కమల నెహ్రు ఆసుపత్రిలో ఏఎన్ఎంగా విధులు నిర్వహించేవారు. జూన్ 2026 లో నిర్వహించిన సాధారణ బదిలీలలో ఆమెను జనగామ జిల్లా జాఫర్‌గఢ్ ఏరియా ఆసుపత్రికి బదిలీ చేశారు. అయితే, సుజాత సొంత నివాసం సూర్యాపేట పట్టణం కావడం.. దానికి అత్యంత సమీపంలో ఉన్న నకిరేకల్ ఏరియా ఆసుపత్రిలో ఖాళీ ఉన్నప్పటికీ ఆమెకు అక్కడ పోస్టింగ్ దక్కలేదు. తనకంటే వయసులో, సీనియారిటీలో జూనియర్ అయిన కే. రమణి అనే మరో ఏఎన్ఎంకు నకిరేకల్ ఏరియా ఆసుపత్రిలో పోస్టింగ్ దక్కడం వెనుక పెద్ద స్కామే జరిగిందని సుజాత ఆరోపిస్తున్నారు. నల్గొండ డీఎంహెచ్‌ఓ (DMHO) కార్యాలయంలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి. గోవిందును రమణి తన భర్తగా చూపిస్తూ.. ఒక నకిలీ స్పౌజ్ సర్టిఫికేట్‌ను సృష్టించి అధికారులను బురిడీ కొట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సూపరింటెండెంట్ చేతివాటం.?
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో కీలక హోదాలో ఉన్న ఆఫీస్ సూపరింటెండెంట్ డి. గోవిందు తన అధికారిక పదవిని దుర్వినియోగం చేస్తూ.. ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారాన్ని వెనకుండి నడిపించారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. బదిలీ కౌన్సిలింగ్‌లో అధికారులను తప్పుదోవ పట్టించి ఈ ప్రాధాన్యత దక్కించుకున్నట్లు సమాచారం.
ఎస్‌ఆర్ (SR)లలో లేని పెళ్లి ముచ్చట...
అక్రమంగా బదిలీ ప్రయోజనం పొందిన కే. రమణి, ఆఫీస్ సూపరింటెండెంట్ డి. గోవిందుల అధికారిక సర్వీస్ రిజిస్టర్లను (SR) పరిశీలిస్తే వీరి అసలు రంగు బయటపడుతుందని బాధితురాలు సవాల్ చేస్తున్నారు. ప్రభుత్వ రికార్డుల్లోని ఫ్యామిలీ డిక్లరేషన్లు, నామినీ పత్రాలలో ఎక్కడా కూడా వీరిద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ రికార్డులను విచారణలో భాగంగా తనిఖీ చేయాలని కోరారు. తప్పుడు సమాచారంతో బదిలీలు పొందడం తెలంగాణ సివిల్ సర్వీసెస్ (ప్రవర్తన) నిబంధనల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, ఇలాంటి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుజాత డిమాండ్ చేశారు. బాధితురాలి ప్రధాన డిమాండ్లు ఇవే.. కే. రమణి సమర్పించిన స్పౌజ్ సర్టిఫికేట్ అసలైనదా? కాదా? అనే అంశంపై నిష్పక్షపాతంగా, నిర్ణీత కాలపరిమితితో కూడిన ఉన్నత స్థాయి విచారణ జరపాలి. నిబంధనలను ఉల్లంగించి ఈ వివాదాస్పద సర్టిఫికేట్ ఏ అధికారి జారీ చేశారు? ఏ ప్రొసీజర్ ఫాలో అయ్యారనే దానిపై తనిఖీలు చేపట్టాలి. ఇద్దరు ఉద్యోగుల సర్వీస్ రిజిస్టర్లు, నామినీ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. తప్పుడు పత్రాలతో పరిపాలనను తప్పుదోవ పట్టించినట్లు నిరూపితమైతే తెలంగాణ సీసీఏ (CCA) రూల్స్ ప్రకారం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అక్రమ మార్గంలో కే. రమణి దక్కించుకున్న నకిరేకల్ ఏరియా ఆసుపత్రి పోస్టింగ్ ఉత్తర్వులను రద్దు చేసి, అర్హులకు న్యాయం చేయాలని జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులను బాధితురాలు కోరుతున్నది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి