Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నీటి సరఫరా పునరుద్ధరించండి మహా ప్రభో నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 14, 2026 07:14 AM

హామీలు కాదు.. ఉద్యోగాలే కావాలి..!

హామీలు కాదు.. ఉద్యోగాలే కావాలి..!

హామీలు కాదు.. ఉద్యోగాలే కావాలి..!
July 14, 2026 04:43 AM 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

జూలై 15 మహాధర్నాను జయప్రదం చేయండి: సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ, జిల్లా గ్రంథాలయం, మల్లు వెంకట నరసింహారెడ్డి విజ్ఞాన కేంద్రం లైబ్రరీతో పాటు పట్టణంలోని వివిధ స్టడీ హాళ్లలో సీపీఎం నాయకులు కరపత్రాలు పంపిణీ చేస్తూ మహాధర్నాపై విస్తృత ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అత్యధిక యువశక్తి ఉన్న దేశం భారత్ అని, అయితే ఆ యువశక్తిని దేశాభివృద్ధికి వినియోగించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని, కానీ నిరుద్యోగ యువత ఆశలతో రాజకీయాలు చేస్తూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేస్తున్నారని ఆరోపించారు.

'మేక్ ఇన్ ఇండియా' పేరుతో పెద్దఎత్తున ప్రచారం చేసినప్పటికీ, ప్రభుత్వ రంగంలో కొత్త ఉద్యోగాల భర్తీ జరగలేదని, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడం వల్ల ఉపాధి అవకాశాలు మరింత తగ్గిపోయాయని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే యువతకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన మార్గమని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో వేలాది మంది యువత త్యాగాలు, నిరుద్యోగుల ఆకాంక్షలు కీలక పాత్ర పోషించాయని గుర్తు చేసిన ఆయన, రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగాల భర్తీ విషయంలో నిరాశే ఎదురైందన్నారు. ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్లు పేపర్ లీకేజీలు, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదాలతో నిలిచిపోవడం వల్ల నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ నెలకొందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నిరుద్యోగ సమస్యనే ప్రధాన ఎన్నికల అంశంగా ప్రస్తావించిందని, ఎన్నికల మేనిఫెస్టోలో 'యూత్ డిక్లరేషన్' ప్రకటించి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై హామీలు ఇచ్చిందని తుమ్మల వీరారెడ్డి గుర్తు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా అశోక్‌నగర్‌లో నిరుద్యోగులతో సమావేశమై అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా, కేవలం సుమారు 16 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసి గొప్పలు చెప్పుకుంటోందని ఆయన విమర్శించారు. ప్రతి ఏడాది ఉద్యోగాల భర్తీకి సంబంధించి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతూ, హాస్టళ్లలో ఉంటూ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత ఆశలను ప్రభుత్వం వమ్ము చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యోగ నోటిఫికేషన్లు లేకపోవడం, భవిష్యత్తుపై భరోసా లేకపోవడం వల్ల కొందరు నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర నిర్మాణం యువత ఆకాంక్షల పునాదులపై నిలిచిందని, అలాంటి యువత భవిష్యత్తును రక్షించడం ప్రభుత్వాల చారిత్రక బాధ్యత అని స్పష్టం చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని, పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జూలై 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మహాధర్నాలో నిరుద్యోగ యువత, విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని తుమ్మల వీరారెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ ప్రచార కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, పట్టణ కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య, మండల కార్యదర్శి నలపరాజు సైదులు, జిల్లా కమిటీ సభ్యులుమల్ల మహేష్, నాయకులు ఆకారపు నరేష్, బొల్లు రవీందర్, పోలే సత్యనారాయణ, మేడి కిరణ్, జంజిరాల శ్రీనివాస్, కిరణ్ అదిల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News