ఇంటి వివాదమే కారణం.. చేతికి తీవ్ర గాయం.
ఇంటి విషయంలో నెలకొన్న వివాదం ఓ తండ్రి దాడికి దారితీసింది. కూతురిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన నకిరేకల్ పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌కు చెందిన రాగం స్వప్న (29) టైలరింగ్ వృత్తి చేస్తూ జీవిస్తోంది. కుటుంబ విభేదాల కారణంగా కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటూ మూసీ రోడ్డులో అద్దె గదిలో నివసిస్తోంది. డాక్టర్స్ కాలనీలో టైలరింగ్ షాపు నిర్వహిస్తోంది.
స్వప్న తండ్రి అయినాల లింగయ్య తన కుమార్తెకు శివాజీనగర్‌లో ఇంటిని కట్నంగా ఇచ్చి ఆమె పేరుపై పట్టా చేయించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఇంటిని తిరిగి తమకు ఇవ్వాలని కొంతకాలంగా తండ్రి ఒత్తిడి చేస్తూ, బెదిరిస్తున్నాడని స్వప్న ఆరోపించింది.ఈ క్రమంలో 18వ తేదీ సాయంత్రం సుమారు 6 గంటలకు స్వప్న టైలరింగ్ షాపులో పనిచేస్తుండగా లింగయ్య గొడ్డలితో అక్కడికి వచ్చి ఆమెపై దాడి చేసినట్లు ఫిర్యాదు అందింది. ఈ దాడిలో స్వప్న కుడి తొడకు గాయమైంది. తలపై గొడ్డలితో దాడి చేయబోగా ఆమె ఎడమ చేతిని అడ్డుపెట్టడంతో మణికట్టు పైభాగంలో తీవ్ర గాయమైనట్లు పోలీసులు తెలిపారు.
గాయపడిన స్వప్నను తొలుత ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం నకిరేకల్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వైద్యుల తుది నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి