22ఎ సమస్యలకు త్వరలో చెక్
వారంలోగా ప్రభుత్వ ఆదేశాలు.. నెల రోజుల్లో సమస్యల పరిష్కారం
హైదరాబాద్ సెప్టెంబర్ 19 స్థానికం ప్రతినిధి :
22ఎ కింద ఉన్న భూ సమస్యలకు త్వరలో పరిష్కారం చూపుతామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మరో వారం రోజుల్లో ప్రభుత్వ ఆదేశాలు వెలువడేలా చర్యలు తీసుకుంటున్నామని, నెల రోజుల్లో సమస్యలను పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నామని చెప్పారు.ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 44 కాలనీల ఇళ్ల క్రమబద్ధీకరణ ధ్రువపత్రాలను శనివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో మంత్రి పొంగులేటి, మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ తదితరులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభలో ప్రకటించిన 12 అంశాలపై ప్రభుత్వం దశలవారీగా చర్యలు చేపడుతోందన్నారు. ఇందులో కాలనీల సమస్యకు జీవో 118, సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు జీవో 76 జారీ చేశామని తెలిపారు.
44 కాలనీల సమస్య పరిష్కారం
ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని 64 కాలనీల్లో 44 కాలనీల సమస్యలను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిషేధిత ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించి ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని చెప్పారు. ఎవరి ఇళ్లూ కూల్చబోమని స్పష్టం చేశారు.
సింగరేణి సమస్యకు 45 రోజుల్లో పరిష్కారం
సింగరేణి ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కోసం ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశామని, 45 రోజుల్లో భూ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని పొంగులేటి తెలిపారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ జీవో 118 ద్వారా మరికొంతమంది సమస్యలను పరిష్కరిస్తామని వెల్లడించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డి.సుధీర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, మధుయాష్కీ గౌడ్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి