అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు క్రమంగా తగ్గుతున్న వేళ, సుమారు 350 కంపెనీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కోదాడ మెగా జాబ్ మేళా తెలంగాణ నిరుద్యోగ యువతకు కొత్త ఆశాకిరణంగా నిలిచిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి భారీ ఉద్యోగ మేళాలు నిర్వహించి, అర్హత కలిగిన యువతను నేరుగా ప్రముఖ సంస్థలతో అనుసంధానం చేయాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో వేలాది మంది ఉద్యోగార్థులను ఉద్దేశించి స్పీకర్ ప్రసంగించారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు పొందడం రోజురోజుకూ కష్టంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సుమారు 350 కంపెనీలను కోదాడకు తీసుకురావడం అసాధారణమైన విజయమని కొనియాడారు.తాను దాదాపు 30 నుంచి 35 సంవత్సరాలుగా రాజకీయ, ప్రజాజీవితంలో ఉన్నప్పటికీ ఇంత భారీ స్థాయిలో నిర్వహించిన ఉద్యోగ మేళాను ఎప్పుడూ చూడలేదన్నారు. ఇది ఒక్కరోజు కార్యక్రమంగా మిగిలిపోకూడదని, తెలంగాణవ్యాప్తంగా నిరంతరం ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించాలని సూచించారు. కోదాడతోపాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా, పరిసర ప్రాంతాల నిరుద్యోగ యువతకు ఈ మేళా గొప్ప అవకాశమని పేర్కొన్నారు.ఈ జాబ్ మేళా కేవలం ఉద్యోగ నియామక కార్యక్రమం మాత్రమే కాదని, వేలాది మంది యువత జీవితాల్లో కొత్త అధ్యాయానికి నాంది అని స్పీకర్ అభివర్ణించారు. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల ప్రతి అభ్యర్థి కళ్లలో కనిపిస్తోందని, ఆ సంకల్పమే వారిని విజయతీరాలకు చేరుస్తుందని చెప్పారు.
ఒక్క ఉద్యోగం ఒక వ్యక్తి జీవితాన్నే కాకుండా, ఆ కుటుంబం మొత్తానికి భరోసానిస్తుందని ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ఇప్పటికే 60 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉద్యోగ ప్రకటనలు వెలువరిస్తామని తెలిపారు. నిరుద్యోగ యువత కలలను ప్రజా ప్రభుత్వం తప్పకుండా సాకారం చేస్తుందని స్పష్టం చేశారు. గతంలో హుజూర్‌నగర్‌లో నిర్వహించిన జాబ్ మేళాకు 20 వేల నుంచి 30 వేల మంది వరకు అభ్యర్థులు హాజరయ్యారని, దాదాపు మూడు వేల మంది ఉద్యోగాలు పొందారని గుర్తుచేశారు. సుమారు 350 కంపెనీల భాగస్వామ్యంతో కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా అంతకంటే భారీ స్థాయిలో జరుగుతోందన్నారు.
ఇంటర్వ్యూలంటే భయపడవద్దని, తొలి ప్రయత్నంలో ఉద్యోగం రాకపోయినా నిరుత్సాహానికి గురికావద్దని అభ్యర్థులకు సూచించారు.ఈరోజు పొందిన ఇంటర్వ్యూ అనుభవం రేపటి విజయానికి పునాది అవుతుందన్నారు. విజయం ఎల్లప్పుడూ జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పకపోవచ్చని, కానీ ఓటమి మాత్రం తిరిగి ఎలా నిలబడాలో నేర్పుతుందని స్ఫూర్తిదాయకంగా చెప్పారు. ఒక కంపెనీ అవకాశం ఇవ్వకపోతే, మరో కంపెనీ మీ ప్రతిభను గుర్తించేందుకు సిద్ధంగా ఉండొచ్చని యువతలో ధైర్యం నింపారు.ఇంత భారీ ఉద్యోగ మేళాను నిర్వహించిన రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఎన్. పద్మావతి రెడ్డిని స్పీకర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ప్రాంత యువతకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి దృఢమైన అండగా నిలుస్తున్నారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని గడ్డం ప్రసాద్ కుమార్ స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి