హైదరాబాద్ సెప్టెంబర్ 19
జూబ్లీహిల్స్‌లోని డాక్టర్ ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో 20వ రోజ్‌గార్ మేళాను కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ శనివారం ప్రారంభించారు. హైదరాబాద్ జోన్ సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 221 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో నిర్వహించిన 20వ రోజ్‌గార్ మేళాలో 51 వేల నియామక పత్రాలు అందించినట్లు బండి సంజయ్ తెలిపారు. ఇప్పటివరకు జరిగిన 19 రోజ్‌గార్ మేళాల్లో 12.75 లక్షల నియామక పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 10 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పంలో భాగంగానే రోజ్‌గార్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి
నూతనంగా నియమితులైన ఉద్యోగులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని బండి సంజయ్ సూచించారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా తదితర కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ జోన్ సెంట్రల్ ట్యాక్స్, కస్టమ్స్ చీఫ్ కమిషనర్ అరుణ్‌కుమార్ మాట్లాడుతూ.. నూతన ఉద్యోగులకు ఎన్‌ఏసీఐఎన్‌లో జీఎస్టీ, కస్టమ్స్, సంబంధిత చట్టాలు, కార్యాలయ విధానాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఇన్‌స్పెక్టర్లకు తెలంగాణ పోలీస్ అకాడమీ సహకారంతో ప్రత్యేక శిక్షణ అందిస్తామన్నారు.
కార్యక్రమంలో హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.జే. కుమరేష్, ఉన్నతాధికారులు, నూతన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి