5 వేల మందికి ఉపాధి కల్పించాలని కంపెనీలకు మంత్రి కోమటిరెడ్డి పిలుపు..
5 వేల మందికి ఉపాధి కల్పించాలని కంపెనీలకు మంత్రి కోమటిరెడ్డి పిలుపు..
NM Yadav
నిరుద్యోగులకు సర్కార్ భరోసా నల్లగొండలో మెగా జాబ్ మేళా..
ఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం..
యువత తాకిడితో ఆదివారం కూడా మేళా నిర్వహణకు ఆదేశం..
124 కంపెనీల భాగస్వామ్యం వేలాదిగా తరలివచ్చిన నిరుద్యోగులు..
నల్లగొండ : దేశంలో నిరుద్యోగం ఒక ప్రధాన సమస్యగా మారిందని, యువత చదివిన చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా శనివారం జిల్లా కేంద్రంలోని ‘న్యాక్’ (నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్)లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ సర్కార్ యువత భవిష్యత్తు కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో ఈ తరహా మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి..
నల్లగొండ జిల్లాలో సిమెంటు, ఫార్మా, రైస్ ఇండస్ట్రీస్ వంటి అనేక పరిశ్రమలు ఉన్నాయని, ఆయా సంస్థలు స్థానిక యువతకు పెద్దపీట వేయాలని మంత్రి సూచించారు. ఈ మేళా ద్వారా కనీసం 5 వేల మందికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు అందజేయాలని కంపెనీల ప్రతినిధులను కోరారు. నిరుద్యోగుల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో, జాబ్ మేళాను ఆదివారం కూడా పొడిగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నిరుద్యోగులు సమయాన్ని వృధా చేయకుండా లభించిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, ఉద్యోగం చేస్తూనే ఉన్నత లక్ష్యాల కోసం సిద్ధం కావాలని హితవు పలికారు. గతంలో తన హయాంలో 18,400 మందికి ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇటీవల జిల్లాలోని ఫార్మా కంపెనీల్లో జరిగిన ప్రమాదాలపై మంత్రి స్పందిస్తూ.. ప్రతి పరిశ్రమలో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని హెచ్చరించారు. అలాగే పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
124 కంపెనీల ప్రాతినిధ్యం కలెక్టర్..
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఈ మేళాలో ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా వంటి రంగాలకు చెందిన సుమారు 124 ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం వచ్చినా ఆ ఆర్థిక పరిస్థితి మారుతుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్యరెడ్డి , ఇన్చార్జ్ కలెక్టర్ అశోక్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, వివిధ శాఖల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి