15 రోజులలో యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలి..
15 రోజులలో యుద్ధప్రాతిపదికన ధాన్యం కొనుగోళ్లు చేయాలి..
NM Yadav
అధికారులకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశం..
నల్గొండ : రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియను రానున్న 15 రోజుల్లో యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లాలోని చిట్యాల మండలం పెదకాపర్తి కొనుగోలు కేంద్రాన్ని, వట్టిమర్తిలోని రైస్ మిల్లును తనిఖీ చేశారు. అనంతరం సూర్యాపేట వెళ్తూ మార్గమధ్యలో నల్గొండ సమీపంలోని కామినేని ఆస్పత్రి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ధాన్యం సేకరణపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని తద్వారా రైతులకు నగదు చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలన్నారు. తూకం, రవాణా, హమాలీల లభ్యతపై నిరంతరం నిఘా ఉంచాలని మిల్లుల వద్ద ధాన్యం అన్లోడింగ్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా సరిపడా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా రైతులకు, సిబ్బందికి ఇబ్బంది కలగకుండా నీడ కోసం టెంట్లు, తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.
మిల్లర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాం..
ఈ ఏడాది ధాన్యం సేకరణ కోసం ప్రభుత్వం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు చేసిందని కమిషనర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 11 కోట్ల కొత్త గన్ని బ్యాగులను అందుబాటులోకి తెచ్చామని మిల్లర్లకు చెల్లించాల్సిన ఛార్జీలతో పాటు బాయిల్డ్ రైస్ టార్గెట్‌ను కూడా అడ్వాన్స్‌గా కేటాయించామని చెప్పారు. ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందుతున్నందున మిల్లర్లు కూడా ధాన్యం అన్లోడింగ్‌లో వేగం పెంచి సహకరించాలని కోరారు. రవాణాలో ఇబ్బందులు తలెత్తకుండా అదనపు వాహనాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఎక్కడ హమాలీల కొరత ఉన్నా వెంటనే సమీప ప్రాంతాల నుండి రప్పించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
జిల్లాలో 457 కేంద్రాలు..
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ జిల్లాలోని సేకరణ వివరాలను వివరిస్తూ.. జిల్లావ్యాప్తంగా 457 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని కమిషనర్‌కు తెలిపారు. ధాన్యం రవాణా కోసం మిల్లులకు ప్రత్యేకంగా 800 లారీలను కేటాయించామని, హమాలీల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతిరోజూ టెలీ కాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, పౌరసరఫరాల శాఖ అధికారులు, రవాణా, సహకార, మార్కెటింగ్ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి