ట్రినిటీ స్కూల్ ఎదుట అఖిలపక్ష సంఘాల భారీ ధర్నా
ట్రినిటీ స్కూల్ ఎదుట అఖిలపక్ష సంఘాల భారీ ధర్నా
K.RAVI
* ఒకే అనుమతితో మూడు పాఠశాలల నిర్వహణపై నిరసన
* విద్యార్థి, యువజన సంఘాల నాయకుల అరెస్ట్.. చౌటుప్పల్‌లో ఉద్రిక్తత
చౌటుప్పల్ పట్టణంలోని ట్రినిటీ స్కూల్ యాజమాన్యం ఒకే ప్రభుత్వ అనుమతితో నిబంధనలకు విరుద్ధంగా మూడు పాఠశాలలను నిర్వహిస్తూ, విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ విద్యా నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా నడుపుతున్న విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో ధర్నా నిర్వహిస్తున్న నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడంతో స్థానికంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది.ఈ సందర్భంగా విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, పల్లె మధుకృష్ణ, దిండు భాస్కర్, కొండూరు వెంకన్న, పబ్బు వంశీ, బండిగారి శ్రీధర్, తిగుళ్ల శ్రీను, రాఘవ తదితరులు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలపై పర్యవేక్షణను పూర్తిగా కోల్పోయిందని విమర్శించారు. కనీస ప్రభుత్వ అనుమతులు లేకుండా, ఒకే పర్మిషన్‌తో అనేక బ్రాంచ్‌లను నడపడం చట్టవిరుద్ధమని మండిపడ్డారు. కొన్ని యాజమాన్యాలు విద్యార్థుల భద్రతను, విద్యా ప్రమాణాలను పక్కనబెట్టి కేవలం వ్యాపార ధోరణితో విద్యాసంస్థలను నడుపుతున్నాయి. వీటిపై విద్యాశాఖ అధికారులు పట్టించుకోకపోవడం అత్యంత బాధాకరం. చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విద్యాసంస్థలపై తాము వరుసగా పోరాటాలు చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం వల్లే ప్రజాస్వామ్య పద్ధతిలో ధర్నా చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. ధర్నా శాంతియుతంగా సాగుతున్న సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను అడ్డుకోవడంపై నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పలువురు నాయకులను, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సమస్యను పరిష్కరించాల్సిన అధికార యంత్రాంగం, హక్కుల కోసం పోరాడుతున్న ఉద్యమకారులపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ధ్వజమెత్తారు.విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి ట్రినిటీ స్కూల్‌తో పాటు చౌటుప్పల్ మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల అనుమతులు, గుర్తింపు పత్రాలు, మౌలిక వసతులు, ఫీజుల వసూళ్లు, ప్రభుత్వ నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అక్రమాలు నిర్ధారణ అయితే సంబంధిత యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, అక్రమాలకు పాల్పడుతున్న యాజమాన్యాలను కాపాడడం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చట్టబద్ధమైన చర్యలు తీసుకోకపోతే, ఈ ఉద్యమాన్ని మండల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయికి విస్తరించి మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కొప్పు రామకృష్ణ, కొల్లూరు నవీన్, రాకేష్, గంగాదేవి శివ, వాలీ, అశోక్, సన్నీ, హరీష్, మనోజ్, ప్రణయ్, మరియ, అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి