సెంటిమెంట్లకు లొంగితే వార్డు అభివృద్ధి నిర్వీర్యం
సెంటిమెంట్లకు లొంగితే వార్డు అభివృద్ధి నిర్వీర్యం
Biksham Goud
ప్రజలు సెంటిమెంట్లకు లొంగితే వార్డుల అభివృద్ధి పూర్తిగా నిర్వీర్యం అవుతుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెరుమళ్ళ అన్నపూర్ణ హెచ్చరించారు. అభివృద్ధి చేసే బీఆర్ఎస్ పార్టీనే అన్ని వర్గాలకు అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మేక భారతి తరపున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గత పదేళ్లుగా రాజకీయాలకు అతీతంగా అందరికీ అండగా నిలిచి సూర్యాపేటను అభివృద్ధి చేసిన ఘనత మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. 30వ వార్డులో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి కౌన్సిలర్‌గా గెలిచిన అభ్యర్థి భర్త మరణంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోకపోయినా, జగదీశ్ రెడ్డి ఆదరించి అండగా నిలిచిన విషయాన్ని ప్రజలు మరచిపోవద్దని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి ప్రస్తుతం సెంటిమెంట్లతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించడం అవివేకమని విమర్శించారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రతి వార్డులో జగదీశ్ రెడ్డి మార్క్ అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, అదే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి కారణమవుతుందని ఆమె అన్నారు. ఎన్నికల సమయంలో కార్చే కన్నీళ్లకు, సెంటిమెంట్లకు లొంగితే ప్రజలు ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడాల్సి వస్తుందని హెచ్చరించారు.
అందరికీ అందుబాటులో ఉంటూ వార్డు సమస్యలను తెలుసుకుంటూ మీకోసం నేనున్నా అంటూ ముందుకు వస్తున్న మేక భారతి అభివృద్ధి చేసే అభ్యర్థి అని తెలిపారు. కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మహిళలకు అండగా నిలిచి రెండుసార్లు మహిళలను చైర్పర్సన్లుగా చేసి సూర్యాపేట అభివృద్ధిలో భాగస్వాములను చేశారని గుర్తు చేశారు. జనరల్ స్థానంలో తనకు చైర్పర్సన్ అవకాశం ఇచ్చినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనపై అవిశ్వాసం పెట్టిన సమయంలో 30వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దళిత మహిళ అయిన తనకు మద్దతు ఇవ్వకుండా పార్టీ మారిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి వారి సెంటిమెంట్లకు విలువైన ఓటును వృథా చేయవద్దని సూచించారు. మూడు దశాబ్దాలుగా మూసి నీటిని తాగిన ప్రజలకు కృష్ణ నీటిని అందించడం, జిల్లా కేంద్రానికి శిలాతోరణంగా మెడికల్ కళాశాల ఏర్పాటు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా రెండు ట్యాంక్ బండ్లతో బోటింగ్ సదుపాయం కల్పించిన ఘనత జగదీశ్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. గత డెబ్బై ఏళ్లలో జరగని అభివృద్ధి పదేళ్లలో జరిగిందని, అభివృద్ధి చేసే నాయకులను కౌన్సిలర్లుగా ఎన్నుకున్నప్పుడే వార్డులు, ప్రజలు బాగుంటారని తెలిపారు.30వ వార్డు ప్రజలు అభివృద్ధి చేసే మేక భారతి కారు గుర్తుకు ఓటు వేసి ఆదరించాలని, ఆమె అన్ని విషయాల్లో అండగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్ పాలెం సర్పంచ్ ఉప్పల సైదులు, బీఆర్ఎస్ సూర్యాపేట మండల పార్టీ అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు బడుగుల సైదులు, బొమ్మగాని శ్రీనివాస్, మద్ది శ్రీనివాస్, మద్ది ఉపేందర్ రెడ్డి, ఈదుల శంకరయ్య, అనంతుల వాసుదేవరెడ్డి, కోటమ్మ, విజిత, రేణుక తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి