సంక్రాంతి రద్దీకి ముందస్తు చర్యలు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
సంక్రాంతి రద్దీకి ముందస్తు చర్యలు ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
Biksham Goud
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సంక్రాంతి పండుగ సందర్భంగా వాహనాల రద్దీ అధికంగా ఉండనున్న నేపథ్యంలో ప్రయాణాలు సాఫీగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎస్పీ కే. నరసింహతో కలిసి పోలీస్, రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ, జాతీయ రహదారి అధికారులతో ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్రాంతికి హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుందన్న దృష్ట్యా జాతీయ రహదారి–65పై టేకుమట్ల నుంచి నల్లబండగూడెం వరకు యూ టర్న్‌లను తాత్కాలికంగా మూసివేసి ప్రత్యామ్నాయ రోడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సూర్యాపేట పట్టణంలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, అంజనీపురి కాలనీ, ఈనాడు కార్యాలయం, కోదాడ వై జంక్షన్, రామాపురం క్రాస్‌రోడ్‌ల వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ల సమీపంలో ట్రాఫిక్ ఆగకుండా రెండు వాహనాలు సాఫీగా వెళ్లేలా రోడ్లను వెడల్పు చేయాలని ఆదేశించారు.
ఖమ్మం వైపు వెళ్లే రహదారిలో యూ టర్న్ అవసరం లేకుండా చక్కటి మార్గం ఏర్పాటు చేయాలని, టేకుమట్ల, గుంపుల, తిరుమలగిరి, మునగాల, ఆకుపాముల, కోమరబండ, రామాపురం క్రాస్‌రోడ్ యూ టర్న్‌ల వద్ద బ్లింకింగ్ లైట్లు, రేడియం స్టిక్కర్లు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. టేకుమట్ల నుంచి రామాపురం క్రాస్‌రోడ్ వరకు 24/7 పెట్రోలింగ్ వాహనం, అంబులెన్స్, ట్రోయింగ్ వాహనం, క్రేన్, మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
పండగ రద్దీ సమయంలో భారీ వాహనాలు రహదారులపైకి రాకుండా హోల్డింగ్ ఏరియాలను గుర్తించాలని, పరిశ్రమలకు చెందిన భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో పంపేలా పరిశ్రమ యజమానులకు సూచించాలని ఆదేశించారు. హోటళ్లు, డాబాల వద్ద రోడ్లపై వాహనాలు నిలిపివేయకుండా యజమానులకు తెలియజేయాలని పోలీస్ అధికారులను కోరారు.
పండగకు ముందు నాలుగు రోజులు, తర్వాత నాలుగు రోజులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు రాయనిగూడెం వద్ద యూ టర్న్ మూసివేయనున్నట్లు తెలిపారు. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు చివ్వెంల లేదా ఐలాపురం మార్గంగా సూర్యాపేట పట్టణం గుండా వెళ్లాలని, జనగాం–సిద్ధిపేట వైపు వెళ్లే వాహనాలు కుడకుడ రోడ్డు నుంచి ఐలాపురం మీదుగా బాలెంల వద్ద జనగాం రోడ్డులోకి ప్రవేశించాలని సూచించారు.
సోమవారం సాయంత్రం లోపు జాతీయ రహదారులపై అన్ని భద్రతా చర్యలు పూర్తి చేయాలని, మంగళవారం మండల, డివిజన్ స్థాయి అధికారులు పర్యవేక్షణతో ఆడిటింగ్ చేపట్టనున్నట్లు తెలిపారు.
సూర్యాపేట జనరల్ ఆస్పత్రి, కోదాడ 100 పడకల ఆస్పత్రిలో 24 గంటల ట్రామా కేర్ సేవలు అందుబాటులో ఉండాలని, మునగాలలో కూడా వైద్యులు సిద్ధంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. రహదారులపై పశువులు రాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
సంక్రాంతి సందర్భంగా జిల్లాలో ప్రయాణికుల సౌకర్యార్థం రెవెన్యూ, పోలీస్, జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బీ, రవాణా శాఖ అధికారులతో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ కే. నరసింహ మాట్లాడుతూ, గుంటూరు వెళ్లే వాహనాలు నార్కెట్‌పల్లి నుంచి నల్గొండ–మిర్యాలగూడ మార్గంలో, రాజమండ్రి వెళ్లే వాహనాలు నకిరికల్లు–అర్వపల్లి మీదుగా ఖమ్మం రహదారిలోకి వెళ్లాలని సూచించారు. ముఖ్యమైన జంక్షన్ల వద్ద 24 గంటల పాటు పోలీస్ సిబ్బంది ట్రాఫిక్ నియంత్రణ చేపడతారని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీఓ వేణు మాధవ్, డీఎస్పీ ప్రసన్నకుమార్, ఆర్‌అండ్‌బీ ఈఈ సీతారామయ్య, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, జాతీయ రహదారి అధికారి శ్రవణ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి