పంతంగి టోల్‌గేట్ సమీపంలో ఘటన
– మరొకరికి తీవ్రగాయాలు
గుర్తుతెలియని వాహనాన్ని బైక్ వెనుక నుంచి ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం రామాపురం గ్రామానికి చెందిన నోముల నాగమ్మ, మల్లయ్య దంపతుల చిన్న కుమారుడు నోముల దీపక్ (22) హైదరాబాద్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం (సెప్టెంబర్ 10న) రాత్రి దీపక్ తన స్నేహితుడైన దొన్నపోతుల శ్రీకాంత్‌తో కలిసి బైక్ (TS09 GB1580)పై హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు.మార్గమధ్యలో పంతంగి టోల్‌గేట్ సమీపంలో రాత్రి 9:20 గంటల ప్రాంతంలో వీరి ముందు వెళ్తున్న గుర్తుతెలియని డీసీఎం వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేసింది. దీంతో బైక్ అదుపుతప్పి ఆ వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీసీఎం హుక్కు దీపక్ తలకు గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న శ్రీకాంత్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. మరో బైక్‌పై వీరి వెనకాలే వస్తున్న స్నేహితుడు ఉదయ్ ప్రమాదాన్ని గమనించి బాధితులను అంబులెన్స్‌లో చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. శ్రీకాంత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. మృతుడి తల్లి నాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఎస్సై డి. నర్సిరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి