మహిళలంతా ఐక్యంగా పండుగను ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉంది: సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ
మునగాల మండల పరిధిలోని రేపాల గ్రామంలో శనివారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు కొబ్బరికాయ కొట్టి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఆడిపాడారు.ఈ సందర్భంగా సర్పంచ్ మొగిలిచర్ల సత్యనారాయణ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల్లో ఐక్యతను, ఆత్మీయతను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. గ్రామంలోని మహిళలందరూ కలిసి బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో పండుగల సందర్భంగా ప్రజలందరూ ఐకమత్యంతో పాల్గొంటూ సంప్రదాయాలను కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు.బతుకమ్మ వేడుకలతో రేపాల గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి