రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దు కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్
స్థానికం బృందం
యాసంగి అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయి,
మహబూబాబాద్, స్థానికం ప్రతినిధి
జిల్లాలో ప్రస్తుత యాసంగి (రబీ) సీజన్ లో పంటల సాగు కోసం రైతుల అవసరాలకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎవరూ ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ యూరియా ఎరువుల పంపిణీపై సోమవారం సాయంత్రం ఒక్క ప్రకటనలో తెలిపారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సాఫీగా ఎరువుల పంపిణీ జరిగేలా ప్రణాళికాబద్దంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని సహకార సంఘాలు, సహా ఇతర కేంద్రాలలో జిల్లాకు సరిపడా, యూరియా, ఎరువులు అందుబాటులో ఉంచామని, పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు అందేవిధంగా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు. ఎరువుల పంపిణీ కేంద్రాలలో ప్రతీ చోట కనీసం మూడు కౌంటర్లను నెలకొల్పి రైతులు వచ్చిన వెంటనే వారికి ఎరువులు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ పంపిణీ కేంద్రాల వద్ద షామియానాలు, త్రాగునీరు, ఏర్పాటు చేస్తూ, ఉదయం 6.00 గంటల నుండే పంపిణీ ప్రారంభం అయ్యేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాలో ఎక్కడ కూడా యూరియా, ఇతర ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తుగానే జిల్లా అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు తెప్పిస్తున్నామని అన్నారు. కోరిన వెంటనే ప్రభుత్వం రైతుల అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో యూరియా నిల్వలను జిల్లాకు కేటాయిస్తోందన్నారు. యూరియా ఎరువుల పంపిణీ ప్రక్రియను ప్రతిరోజూ తానే స్వయంగా పర్యవేక్షించడం జరుగుతోందని, పంపిణీలో లోటుపాట్లకు తావులేకుండా పకడ్బందీగా వ్యవహరిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. కాగా పారదర్శకంగా, సాఫీగా యూరియా ఎరువుల పంపిణీ కోసం రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చిందని, రైతు సోదరులు, డీలర్లు గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ ను ఇన్ స్టాల్
చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రైతులకు యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే విషయంలో ఇబ్బంది తలెత్తకుండా వ్యవసాయ, సహకార శాఖలతో పాటు ఇతర శాఖల సిబ్బందిని పంపిణీ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచుతామని అన్నారు. అదేవిధంగా ప్రతి యూరియా విక్రయ కేంద్రంలో యూరియా బుకింగ్ యాప్‌కు సంబంధించిన క్యూ.ఆర్ కోడ్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తారని తెలిపారు. తద్వారా రైతులు సులభంగా యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బుకింగ్ చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. పంట సాగు చేసే ప్రతి రైతుకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి అవసరాలకు సరిపడా యూరియాను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు ఎవరైనా యూరియా సరఫరాలో సమస్యలు ఎదుర్కొంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలని సూచించారు. అయితే ఒకేసారి యూరియా కొనుగోలు చేయకుండా, శాస్త్రీయ పద్ధతిలో అవసరానికి సరిపడా మాత్రమే వినియోగించాలని కలెక్టర్ రైతులను కోరారు. ఎవరైనా ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడం, అధిక ధరలకు విక్రయించడం, దారి మళ్ళించడం వంటి అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, యూరియా పంపిణీలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి