వైజాగ్ కాలనీలో రూ.5 కోట్లతో రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు...
త్వరలో డీపీఆర్‌లు సమర్పిస్తాం... రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్‌కు వివరించిన అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి...
నల్గొండ : జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న నేపథ్యంలో కీలక పర్యాటక ప్రాంతాల్లో ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి అధికారులు స్థలాలను గుర్తించారు. బుద్ధవనం, దేవరకొండ కోట, వైజాగ్ కాలనీ, ఛాయా సోమేశ్వర ఆలయం తదితర ఐదు ప్రాంతాల్లో పర్యాటక హోటళ్ల ఏర్పాటుకు అనువైన స్థలాలను గుర్తించినట్లు స్థానిక సంస్థల ఇన్‌ఛార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్ కరణ్‌రెడ్డి తెలిపారు. ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను (డీపీఆర్) త్వరలో సమర్పిస్తామని వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ బతుకమ్మ వేడుకలు, పర్యాటక శాఖ కార్యక్రమాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, పర్యాటక, ఇతర సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లాలో పర్యాటక అభివృద్ధికి గుర్తించిన ప్రాంతాలు, చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను అదనపు కలెక్టర్ ఆమెకు వివరించారు.
వైజాగ్ కాలనీలో రిసార్ట్, వాటర్ స్పోర్ట్స్...
జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని అదనపు కలెక్టర్ తెలిపారు. ముఖ్యంగా వైజాగ్ కాలనీలో సుమారు రూ.5 కోట్లతో రిసార్ట్ ఏర్పాటు చేయడంతో పాటు వాటర్ స్పోర్ట్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చని వివరించారు. ఈ ప్రతిపాదనకు సంబంధించి అవసరమైన ప్రణాళికలను రూపొందించి త్వరలోనే డీపీఆర్ సమర్పించనున్నట్లు చెప్పారు. దేవరకొండ కోట, ఛాయా సోమేశ్వర ఆలయం సహా గుర్తించిన ఇతర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, సందర్శకులకు అవసరమైన సౌకర్యాల ఏర్పాటుపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. దేవరకొండ కోట, ఛాయా సోమేశ్వర ఆలయం వద్ద సందర్శకుల భద్రత దృష్ట్యా సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్రసాద్ సూచించారు. దీనికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని అదనపు కలెక్టర్ తెలిపారు.
18న సద్దుల బతుకమ్మ వేడుకలు...
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 18న సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఉత్సవాలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. బతుకమ్మ వేడుకల్లో ప్రతిరోజూ నిర్వహించే కార్యక్రమాల వివరాలను రాష్ట్రస్థాయి అధికారులకు పంపించాలని స్పష్టం చేశారు.
పర్యాటక రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యం...
రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని వాణి ప్రసాద్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక సబ్‌కమిటీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం, టూరిజం హోటళ్లు, ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణం, వ్యూ పాయింట్ల అభివృద్ధి, అడ్వెంచర్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు వంటి అంశాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. అటవీ ప్రాంతాల్లో పర్యావరణానికి అనుకూలంగా ఎకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 142 పర్యాటక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. పర్యాటక ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రచారం పొందని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో పాటు వీడియోలు, ఫొటోలను రాష్ట్రస్థాయికి పంపించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు ఎస్పీ రమేష్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి, ఇన్‌ఛార్జి పర్యాటక అధికారి అక్బర్ అలీ, సమాచార శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు, మెప్మా పీడీ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి