‘ఫుడ్ 7 మిడ్డే ప్లాజా’లో పురుగులు పట్టిన పెసరపప్పు గుర్తింపు.. నమూనాలు ల్యాబ్‌కు.
తనిఖీల సమాచారంతో హోటళ్లు, బేకరీలు మూసివేసిన వ్యాపారులు.
చిట్యాల, అక్టోబర్ 13: నాణ్యమైన ఆహారాన్ని అందించాల్సిన హోటళ్లలో ఆహార భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశంపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దృష్టి సారించారు.
ఈ క్రమంలో నల్లగొండ జిల్లా చిట్యాల పరిధిలో జాతీయ రహదారి వెంట ఉన్న హోటళ్లలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ‘ఫుడ్ 7 మిడ్డే ప్లాజా’లో నాణ్యతలేని, పురుగులు పట్టిన పెసరపప్పును గుర్తించినట్లు సమాచారం.
సదరు పెసరపప్పు నమూనాలను సేకరించిన అధికారులు పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. ల్యాబ్ నివేదిక ఆధారంగా ఆహార పదార్థాల నాణ్యతపై స్పష్టత రానుంది. హోటళ్లలో నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, వాటి నాణ్యత, ఆహార భద్రత నిబంధనల అమలుపై అధికారులు తనిఖీలు చేపట్టారు.
తనిఖీల సమాచారంతో దుకాణాలు మూసివేత!
ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల సమాచారం తెలుసుకున్న పలువురు వ్యాపారులు తమ దుకాణాలు, బేకరీలు, హోటళ్లను మూసివేసినట్లు తెలిసింది. దీంతో ఆహార భద్రత నిబంధనల అమలుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజలకు విక్రయించే ఆహార పదార్థాల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని, అధికారులు తనిఖీలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పెసరపప్పు నమూనాల ల్యాబ్ నివేదికలో ఏయే అంశాలు వెల్లడవుతాయి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాలి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి