నల్గొండ జిల్లాలో నిధుల ఖర్చుపై వివాదం.!
మర్రిగూడ మండలంలో అభివృద్ధి కార్యక్రమాల వ్యయాలపై ఫిర్యాదు...
సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి ఎంపీడీవో అక్రమాలు...
నల్గొండ : మర్రిగూడ మండలంలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు చేసిన ఖర్చులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మండల పరిషత్ అభివృద్ధి అధికారి పనితీరు, ప్రభుత్వ నిధుల వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ మండలానికి చెందిన ఎర్రపుల శ్రీశైలం ఈ రోజు గ్రీవెన్స్ లో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ఖర్చులపై అభ్యంతరాలు...
గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూ.4,18,169 ఖర్చు చేసినట్లు, ఈ నిధుల వినియోగంపై అనుమానాలు ఉన్నట్లు ఫిర్యాదుదారు పేర్కొన్నారు. ఎన్నికల విధుల కోసం బస్సులు, కార్లు వినియోగించడం, వాహనాలకు డీజిల్ పోయించడం, ఇతర ఖర్చులకు సంబంధించిన బిల్లుల లో అక్రమాలు జరిగినట్లు, ఈ ఖర్చులకు సంబంధించిన రికార్డులు, బిల్లులు, చెల్లింపులను పరిశీలించాలని కోరారు.
ప్రజాపాలన సమావేశానికి రూ.1.98 లక్షలా?
ప్రజాపాలన కార్యక్రమానికి సంబంధించి సమావేశాల నిర్వహణ ఖర్చులపైనా, సమావేశానికి టీ, అల్పాహారం, బిస్కెట్లు, భోజనం, కుర్చీలు, ఫ్లెక్సీలు తదితర అంశాల కోసం ఖర్చు చేసినట్లు రికార్డుల్లో ఉన్న వివరాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి సుమారు రూ.1,98,300 ఖర్చు చేసినట్లు పేర్కొంటూ, వాస్తవంగా జరిగిన కార్యక్రమాలు, హాజరైన వారి సంఖ్య, సమర్పించిన బిల్లులను సరిపోల్చి పరిశీలించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణకు రూ.లక్ష ఖర్చు చేసినట్లు పత్రాల్లో పేర్కొన్నారని ఫిర్యాదుదారు తెలిపారు. అలాగే వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వివిధ కార్యక్రమాలకు చేసిన చెల్లింపులు, వాస్తవ ఖర్చుల మధ్య వ్యత్యాసాలున్నాయా అనే అంశంపై విచారణ జరపాలని కోరారు.
సమగ్ర విచారణకు డిమాండ్...
ప్రభుత్వ నిధుల వినియోగానికి సంబంధించిన బిల్లులు, వోచర్లు, వాహనాల అద్దె చెల్లింపులు, డీజిల్ ఖర్చులు, కార్యక్రమాల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని ఫిర్యాదుదారు విజ్ఞప్తి చేశారు. సంబంధిత అధికారుల వివరణ తీసుకుని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి