నల్లగొండలో ఉద్రిక్తత తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీర కట్టడంపై బీఆర్ఎస్ అభ్యంతరం...
నల్లగొండ: నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల జంక్షన్ వద్ద ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి ఆదివారం సాయంత్రం కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు 'ఇందిరమ్మ చీర' కట్టడం తీవ్ర కలకలానికి దారితీసింది. ఈ ఘటనపై స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ఉద్యమకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి..
తెలంగాణ తల్లి విగ్రహానికి ఇందిరమ్మ చీర కట్టడాన్ని నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్రంగా ఆక్షేపించారు. ఐదు కోట్ల తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఇలాంటి చర్యలకు పాల్పడటం గర్హనీయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ద్రోహులు, రాష్ట్ర పురోగతిని వ్యతిరేకించే వ్యక్తులే ఇలాంటి అపచారానికి పూనుకుంటారని మండిపడ్డారు. గతంలో ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట్టిన నిందితులపై ఏ విధమైన కేసులు నమోదు చేశారో, ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కూడా అదే స్థాయిలో కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తక్షణమే స్పందించి విచారణ చేపట్టకపోతే భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు మరిన్ని పునరావృతమయ్యే ప్రమాదం ఉందన్నారు. విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు ఎన్జీ కళాశాల వద్దకు భారీగా చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల జోక్యంతో మున్సిపల్ సిబ్బంది వెంటనే విగ్రహానికి కట్టిన ఇందిరమ్మ చీరను తొలగించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి గౌరవ పురస్కారాలు అందించారు.
రాష్ట్రవ్యాప్త ఆందోళనకు హెచ్చరిక..
ఈ ఘటనను నిరసిస్తూ పలువురు పార్టీ ముఖ్య నాయకులు, ఉద్యమకారులు తీవ్రంగా ఖండించారు. దోషులపై వెంటనే చట్టరీత్యా చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, గుండె వెంకటేశ్వర్లు, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్య రెడ్డి, బక్క పిచ్చయ్య, సింగం రామ్మోహన్, అభిమన్యు శ్రీనివాస్, నగర పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, జమాల్ ఖాద్రి, కంకణాల వెంకటరెడ్డి తదితర బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి