ప్రజాప్రతినిధులు నెలకు ఒకసారి పాఠశాలలను సందర్శించాలి..
ప్రజాప్రతినిధులు నెలకు ఒకసారి పాఠశాలలను సందర్శించాలి..
NM Yadav
ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రజాప్రతినిధులు కృషి చేయాలి..
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..
నల్గొండలో విద్యా వారోత్సవాలపై అవగాహన సదస్సు..
నల్గొండ : విద్యే అభివృద్ధికి పునాది అని, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రజాప్రతినిధులు నిరంతరం కృషి చేయాలని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా నిర్వహిస్తున్న విద్యా వారోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం నల్గొండ టీటీడీసీలో నియోజకవర్గ స్థాయి సర్పంచులు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎక్కడైతే విద్య ఉంటుందో అక్కడే ప్రగతి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో విద్య కోసం 8 శాతం నిధులను కేటాయిస్తోందని ప్రతి సర్పంచ్ మరియు కార్పొరేటర్ నెలకు కనీసం ఒక్కసారైనా తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యా బోధన, మౌలిక వసతులపై పర్యవేక్షణ చేయాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 23 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 19 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, 12 వేల ప్రైవేట్ పాఠశాలల్లో 39 లక్షల మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయుడికి 30 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఉపాధ్యాయులు గ్రామాల్లోనే ఉంటూ విద్యార్థులతో క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని గుర్తుచేశారు. ప్రభుత్వం విద్య కోసం వేల కోట్లు ఖర్చు చేస్తూ కిట్లు, యూనిఫాంలు, స్కాలర్‌షిప్పులు అందిస్తోందని, ముఖ్యంగా రూ. 20 వేల కోట్లతో 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెంచేలా ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని కోరారు.
జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే వంటి మహనీయులను ఆదర్శంగా తీసుకుని విద్యను అందరికీ చేరువ చేయాలని కోరారు. జిల్లాలో ఇటీవల పదో తరగతి పరీక్షల్లో 98.47 శాతం ఉత్తీర్ణత సాధించామని, విద్యార్థులకు ఐఐటీ కోచింగ్ కూడా ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో 43 పీఎం శ్రీ పాఠశాలల్లో ఆధునిక ల్యాబ్‌లు, సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రవేశాలు పెరుగుతున్నాయని, ఫెయిల్ అయిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. క్షేత్రస్థాయి సమస్యలను వెంటనే పరిష్కరించి నాణ్యమైన విద్య అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నేడు డిజిటల్ క్లాసులు, ల్యాబ్స్ అందుబాటులో ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, కార్పొరేటర్లు, సర్పంచులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి