విధి నిర్వహణలో నిరంతరం శ్రమించే జర్నలిస్టులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. సన్రైజ్ ఆసుపత్రి సహకారంతో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో బుధవారం సంగారెడ్డిలోని సన్రైజ్ ఆసుపత్రిలో జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పని ఒత్తిడి, సమయాభావం కారణంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలని సూచించారు. ఈ శిబిరంలో వైద్య నిపుణులు ఉచిత వైద్య సంప్రదింపులతోపాటు ఈసీజీ, 2డీ ఎకో, రక్త పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. గుండె, ఊపిరితిత్తులు, ఎముకలు, కీళ్లు, మధుమేహం, నరాల సంబంధిత సమస్యలతోపాటు మహిళల ఆరోగ్య సమస్యలకు వైద్య సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఫైజల్ అలీ, జిల్లా అధ్యక్షుడు బండారి యాదగిరి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావేద్ అలీ, సన్రైజ్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ స్వామి గౌడ్, రథసారథి తెలుగు దినపత్రిక సంపాదకుడు సంతోష్ గౌడ్, జర్నలిస్టు సంఘాల నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి