నల్గొండ డీఎంహెచ్ఓ కార్యాలయంలో నియామకాలపై ఆరోపణలు!
నోటిఫికేషన్ లేకుండానే పోస్టుల భర్తీ జరిగిందా?
ఎన్హెచ్ఎం–ఎన్టీఈపీ పరిధిలో 4 ల్యాబ్ టెక్నీషియన్, 2 ఎస్టీఎల్ఎస్ పోస్టులపై వివాదం...
ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు వసూలు చేశారంటూ ఆరోపణలు...
నియామక ప్రక్రియ, రోస్టర్, రిజర్వేషన్ల వివరాలు వెల్లడించాలని నిరుద్యోగుల డిమాండ్...
రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన నిరుద్యోగ అభ్యర్థులు...
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంజాయిషీ కోరుతూ లేఖ పంపినట్లు సమాచారం...
నల్గొండ: జిల్లా వైద్యారోగ్యశాఖ పరిధిలోని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న జాతీయ క్షయవ్యాధి నిర్మూలన కార్యక్రమం (ఎన్టీఈపీ)లో పోస్టుల భర్తీ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. నాలుగు ల్యాబ్ టెక్నీషియన్ (ఎల్టీ), రెండు సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ (ఎస్టీఎల్ఎస్) పోస్టుల నియామక ప్రక్రియపై పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగ ప్రకటన, దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక విధానం, రోస్టర్, రిజర్వేషన్ల అమలు వంటి అంశాలపై స్పష్టత లేదని ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. అర్హత కలిగిన నిరుద్యోగులకు అవకాశం కల్పించకుండా, నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో పోస్టుకు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే షాడో డిఎంహెచ్వో గా పేరు పొందిన ఒక ఉద్యోగి వసూలు చేశారనే ఆరోపణలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఉద్యోగాలలో అక్రమాలకు పాల్పడిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో పనిచేసే వారిపై 0708 2026 రోజున ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగ అభ్యర్థులు కుటుంబ సంక్షేమ శాఖ అధికారి హైదరాబాద్ కి ఫిర్యాదు చేసినట్లు, నల్గొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సంజాయిషీ కోరుతూ కుటుంబ సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం నుంచి లేఖ పంపినట్లు సమాచారం.
ఆరు పోస్టుల భర్తి పై అనుమానాలు...
ఎన్హెచ్ఎం–ఎన్టీఈపీ పరిధిలోని నాలుగు ల్యాబ్ టెక్నీషియన్, రెండు ఎస్టీఎల్ఎస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటన ఎప్పుడు విడుదల చేశారు? దరఖాస్తులు స్వీకరించారా? అర్హతల ఆధారంగా అభ్యర్థులను ఎలా ఎంపిక చేశారు? ఎంపికైన వారి జాబితాను బహిరంగపరిచారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్వహించే ఆరోగ్య కార్యక్రమాల్లో నియామకాలు చేపట్టేటప్పుడు వర్తించే మార్గదర్శకాలు, సంబంధిత ఉత్తర్వులు, ఎంపిక నిబంధనలను పాటించారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది. ప్రకటన లేకుండా నియామకాలు జరిగాయన్న ఆరోపణలు నిజమైతే, ఆ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
రోస్టర్, రిజర్వేషన్ల అమలుపై సందేహాలు...
నియామకాల్లో రోస్టర్ పద్ధతి, రిజర్వేషన్ల అమలు, అభ్యర్థుల అర్హతలు కీలకమైన అంశాలు. ఈ ఆరు పోస్టులకు సంబంధించిన రోస్టర్ వివరాలు ఏమిటి? రిజర్వేషన్ నిబంధనలు వర్తించాయా? ఎంపిక కమిటీ ఏర్పాటు చేశారా? అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా అవకాశం కల్పించారా? అనే అంశాలపై స్పష్టత ఇవ్వాలని నిరుద్యోగులు కోరుతున్నారు. నియామక ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్, దరఖాస్తుల వివరాలు, అర్హతల పరిశీలన, ఎంపిక జాబితా, రోస్టర్ రిజిస్టర్, సంబంధిత అనుమతులు వంటి రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందా లేదా అన్నది కూడా అధికారిక విచారణ ద్వారానే తేలాల్సి ఉంది.
డిప్యుటేషన్ల దందా లో సి సి హల్చల్..
జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో డిప్యుటేషన్లు, సిబ్బంది విధుల కేటాయింపు వ్యవహారాలపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్యాలయంలో కొందరు సిబ్బంది వ్యవహారశైలిపై ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో, సంబంధిత ఉత్తర్వులు, విధుల కేటాయింపు వివరాలు, బాధ్యతల పంపిణీపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే డిప్యుటేషన్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందా? ఎవరి ఆదేశాల మేరకు సిబ్బందిని నియమించారు? అనే అంశాలు సంబంధిత రికార్డుల పరిశీలనతోనే స్పష్టమవుతాయి.
ఉన్నతస్థాయి విచారణ జరపాలి...
నియామకాలపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని నిరుద్యోగులు, ప్రజాసంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్, ఎంపిక ప్రక్రియ, రోస్టర్, రిజర్వేషన్లు, అర్హతల పరిశీలన, నియామక ఉత్తర్వులను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అక్రమ వసూళ్లు జరిగినట్లు ఆధారాలు లభిస్తే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అర్హతలు ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరిగి ఉంటే నిబంధనల ప్రకారం పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి