నల్గొండలో దారుణంగా చంపిన నలుగురి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
నల్గొండలో దారుణంగా చంపిన నలుగురి హత్య కేసును ఛేదించిన పోలీసులు..
NM Yadav
వ్యక్తిగత కక్షలు, బంగారం కోసమే ఘాతుకం..
అక్క కూతురు, అల్లుడితో సహా నలుగురు నిందితుల అరెస్ట్..
నల్గొండ : నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం ఒక ఇంట తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెళ్లి చూడగా.. ఒకే ఇంట్లో నలుగురు సభ్యులు దారుణ హత్యకు గురై, మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించాయి. మృతులను హసీనా (ఆదిత్య స్కూల్ ప్రైవేట్ టీచర్), ఆమె భర్త సుల్తాన్ (45, బ్యాగుల షాప్ ఉద్యోగి), సుల్తాన్ పిల్లలు ముజమ్మిల్ (20), అఫ్కూరా (12)లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీనియర్ అధికారుల ఆదేశాల మేరకు క్లూస్ టీం, ఫోరెన్సిక్ నిపుణులతో దర్యాప్తు ప్రారంభించారు. కేసు తీవ్రత దృష్ట్యా డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి నేతృత్వంలో ముగ్గురు సీఐలు, 7 గురు ఎస్సైలు, సీసీఎస్ సిబ్బందితో కలిపి మొత్తం 7 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.
నేరానికి దారితీసిన కారణాలు పాత కక్షలే...
పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ గండిపేటకు చెందిన టాక్సీ డ్రైవర్ సయ్యద్ అస్లాం (A-1), అతని భార్య తబస్సుం (A-2) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. తబస్సుం తల్లి తహేరా బేగం స్వంత చెల్లెలే మృతురాలు హసీనా. గతంలో హసీనా మొదటి భర్త పెట్టిన కేసులో తబస్సుం తల్లి జైలుకు వెళ్లడానికి హసీనానే కారణమనే పాత కక్ష ఉంది. దీనికి తోడు, ఏడాది క్రితం హసీనా వద్ద అస్లాం లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇటీవల భార్య గర్భవతి కావడం, కొత్త కారు కొనేందుకు మరో లక్ష అడగడంతో హసీనా నిరాకరించడమే కాకుండా.. పాత బాకీ ఇవ్వాలంటూ అవమానకరంగా మాట్లాడింది. దీంతో హసీనా ఇంట్లో దొంగతనం చేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో అస్లాం, అతని స్నేహితుడు సోహైల్ (A-3) ప్రయత్నించారు. కానీ ఏమీ దొరకకపోవడంతో కోపంతో ఇంట్లో కోడిగుడ్లు పగులగొట్టి వెళ్లారు.
యూట్యూబ్ చూసి పక్కా స్కెచ్..
హసీనా ఇల్లు కొనడానికి బ్యాంకులో రూ. 2.25 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిందని, ఇంట్లో 10 తులాల బంగారం ఉందని తెలుసుకున్న అస్లాం దంపతులు ఆమెను చంపితేనే బంగారం దొరుకుతుందని పథకం వేశారు. ఇందుకోసం అస్లాం యూట్యూబ్‌లో "హత్య చేసి దొరకకుండా ఉండటం ఎలా?", "శవాలు ఎన్ని రోజులకు కుళ్లిపోతాయి?" వంటి వీడియోలు చూసి పక్కా స్కెచ్ వేశాడు. పథకం ప్రకారం ఈ నెల 19న అస్లాం తన మహీంద్రా మరాజో కారులో జమ్మి కత్తితో నల్గొండకు వచ్చాడు. అర్ధరాత్రి దాటిన తర్వాత కాంపౌండ్ గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి నక్కి ఉన్నాడు.జూన్ 20వ తేదీ తెల్లవారుజామున 5 గంటల సమయంలో హసీనా తలుపు తీసి బయటకు రాగానే మెడపై కత్తితో నరికాడు. ఆమె కేకలు విని వచ్చిన భర్త సుల్తాన్‌ను కూడా నరికి చంపాడు. నిద్రలేచి భయంతో పారిపోతున్న ముజమ్మిల్‌పై దాడి చేయగా.. అతడు ఐరన్ రాడ్‌తో ప్రతిఘటించాడు. ఈ పెనుగులాటలో అస్లాం చేతికి, కాళ్లకు గాయాలైనా ముజమ్మిల్‌ను వదలకుండా హతమార్చాడు. చివరగా మంచం కింద దాక్కున్న 12 ఏళ్ల చిన్నారి అఫ్కూరా తనను గుర్తుపడుతుందని, సాక్ష్యం లేకుండా చేయడం కోసం బయటకు లాగి మెడపై పొడిచి కిరాతకంగా చంపేశాడు. అనంతరం బీరువాలోని 5 తులాల బంగారం, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను దొంగిలించి, శవాలపై చాపలు, చద్దర్లు కప్పి, ఇంటికి తాళం వేసి హైదరాబాద్ పారిపోయాడు. ఈ బంగారాన్ని దిల్ షుక్ నగర్‌లోని శ్రీ బాలాజీ జ్యువెలర్స్ యజమాని హేమంత్ కుమార్ (A-4) వద్ద తాకట్టు పెట్టి రూ. 5.30 లక్షలు తీసుకున్నాడు.
నిందితుల అరెస్ట్ - సొత్తు స్వాధీనం..
నమ్మదగిన సమాచారంతో పోలీసులు నార్కట్‌పల్లి ఫ్లైఓవర్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు నిందితుల నుండి మహీంద్రా మరాజో కారు, రూ. 3,00,000 నగదు,5 తులాల కరిగించిన బంగారం ముద్ద, హత్యకు ఉపయోగించిన జమ్మి కత్తి, 3 సెల్ ఫోన్లను, రక్తపు మరకల బట్టలు, ల్యాండ్, బ్యాంక్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
పోలీస్ సిబ్బందికి రివార్డులు...
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేవలం 3 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన డి.ఎస్.పి కె. శివరాం రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి, టూ టౌన్ ఇన్స్పెక్టర్ రాఘవరావు, సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, ఇతర ఎస్సైలు, సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులను ప్రకటించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి