Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 16, 2026 03:12 AM

కారల్‌ మార్క్స్‌143వ వర్ధంతి: ఒక చారిత్రక ప్రవాహం

కారల్‌ మార్క్స్‌143వ వర్ధంతి: ఒక చారిత్రక ప్రవాహం

కారల్‌ మార్క్స్‌143వ వర్ధంతి: ఒక చారిత్రక ప్రవాహం
March 14, 2026 07:51 PM 2 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

ప్రపంచం మరోసారి యుద్ధాల అంచులపై నిలిచింది. పశ్చిమాసియా మళ్లీ మంటల్లో కాలిపోతోంది.ఇరాన్‌పై ఇజ్రాయిల్‌,అమెరికా చేపడుతున్న దాడులు, వెనిజులా అధ్యక్షుడి అపహరణ వాటి వెనుక దాగి ఉన్న వ్యూహాలు ప్రపంచ రాజకీయాలను ప్రమాదకరమైన ఉద్రిక్తతల దిశగా నడిపిస్తున్నాయి. ఇదే సమయంలో యూరప్‌లో కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం కూడా అంతర్జాతీయ రాజకీయాలను అస్థిరత వైపు నెడుతోంది. ఇవేమీ మనం మొదటిసారి చూస్తున్న దృశ్యాలు కాదు.చరిత్రను వెనక్కి తిప్పిచూస్తే ఇలాంటివి ఎన్నోసార్లు ప్రపంచాన్ని వణికించాయి.దేశాలు పరస్పరం ఢీకొన్నాయి. లక్షలాది ప్రాణాలు బలయ్యాయి.కొన్ని సందర్భాల్లో ఈ ఘర్షణలు చివరకు ప్రపంచ యుద్ధాలుగా మారి, మానవాళిని మహావిపత్తుల్లో ముంచెత్తాయి.ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న తప్పకుండా మన ముందుకొస్తుంది.. ప్రపంచం ఎందుకు తరచూ యుద్ధాల దిశగా నడుస్తుంది? దేశాల మధ్య ద్వేషాలు,సరిహద్దు వివాదాలే దీనికి కారణమా? లేక ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దాగి ఉన్న వైరుధ్యాలు కారణమా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే ప్రయత్నం మనలను మళ్లీ ఒక మహా మేధస్సు వైపు తీసుకెళ్తుంది. ఆ మేధస్సు పేరు కార్ల్‌ మార్క్స్‌ (Karl Marx). యుద్ధాలు,సంక్షోభాలు,అసమానతలు.. ఇవన్నీయాదృచ్ఛిక ఘటనలు కావని,అవి సమాజంలోని ఆర్థిక నిర్మాణాలతో ముడిపడి ఉంటాయని శాస్త్రీయంగా వివరించిన మేధావి ఆయన ఈ ప్రపంచంలో అసమానతలు ఎందుకు ఉత్పన్నమవు తున్నాయి? సంపద ఎందుకు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతోంది? కార్మికుల శ్రమ ఎందుకు దోపిడీకి గురవుతోంది? ఆర్థిక వ్యవస్థలు ఎందుకు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి? ఈ సంక్షోభాలు ఎందుకు యుద్ధాలకు దారితీస్తున్నాయి? ఇలాంటి ప్రశ్నలకు సమగ్ర సమాధానాన్ని కనిపెట్టే ఒక సరికొత్త దృష్టికోణాన్ని ఆవిష్కరించాడాయన.మార్క్సిజమనే మహోన్నత ఆలోచనా స్రవంతిని ఈ ప్రపంచానికో కానుకగా ఇచ్చాడు.మార్క్సిజానికి హృదయం లాంటిది చారిత్రక భౌతికవాదం (Historical Materialism). సమాజ అభివృద్ధిని వ్యక్తుల సంకల్పాలు కాదు, ప్రధానంగా ఉత్పత్తి శక్తులు,ఉత్పత్తి సంబంధాలే నిర్దేశిస్తాయని ఈ సిద్ధాంతం చెబుతుంది. ఆర్థిక పునాది (economic base) మారినప్పుడు దాని మీద నిర్మితమైన రాజకీయ,న్యాయ, సాంస్కృతిక నిర్మాణాలు కూడా మారక తప్పవు. అందుకే చరిత్రను అర్థం చేసుకోవాలంటే రాజుల కథలకంటే, సమాజంలోని వర్గ సంబంధాలు,ఉత్పత్తి వ్యవస్థల పరిణామాన్ని అధ్యయనం చేయాలనే శాస్త్రీయ ఆలోచనా విధానాన్ని మనముందుంచాడు మార్క్స్‌.ఈ ఆలోచనా ప్రయాణంలో మార్క్స్‌ ఒంటరిగా లేడు. ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడిగా, సహచరుడిగా ఫ్రెడరిక్‌ ఎంగెల్స్‌ (Friedrich Engels) తోడుగా ఉన్నాడు. ఈ ఇద్దరి మేధో భాగస్వామ్యం ఆధునిక చరిత్రలో అత్యంత సృజనాత్మక భావజాలానికి బాటలు వేసింది.పరిశ్రమల విస్తరణతో యూరప్‌లో పెరుగుతున్న కార్మిక వర్గ దోపిడీని వారు అత్యంత దగ్గరగా పరిశీలించారు. ఈ అధ్యయనాల ఫలితంగా వెలువడిందే కమ్యూనిస్టు ప్రణాళిక (The Communist Manifesto).1848లో వెలువడిన ఈ చారిత్రక పత్రం ప్రపంచ రాజకీయాలలో ఒక గొప్ప మలుపు.ఇది కేవలం ఒక సిద్ధాంత ప్రకటన మాత్రమే కాదు,ఒక రాజకీయ ఆచరణకు పిలుపు.ఈ పత్రంలో ఉన్న రెండు ప్రసిద్ధ వాక్యాలు ప్రపంచ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయి. ”ప్రపంచ కార్మికులారా ఏకం కండి.”, ”ఇప్పటివరకు ఉన్న సమాజాల చరిత్ర మొత్తం వర్గపోరాటాల చరిత్రే”..ఇవి మార్క్సిజం యొక్క సారాంశానికి ప్రతీకలుగా నిలుస్తాయి.మార్క్స్‌ సిద్ధాంతాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆయన మహత్తర గ్రంథం దాస్‌ కేపిటల్‌ (Das Kapital)ను చూడాలి. ఇందులో పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అంతర్గత నిర్మాణాన్ని విశ్లేషించాడాయన.పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుడు తన శ్రమ ద్వారా విలువను సృష్టిస్తాడు.కానీ ఆ విలువలో ఒక చిన్న భాగాన్ని మాత్రమే అతడు వేతనంగా పొందుతాడు. అతను సృష్టించిన మొత్తం విలువలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడిదారుడు లాభంగా స్వాధీనం చేసుకుంటాడు. దీనినే మార్క్స్‌”అదనపు విలువ”గా నిర్వచించాడు.ఈ సిద్ధాంతం పెట్టుబడిదారీ వ్యవస్థలోని దోపిడీ స్వభావాన్ని బట్టబయలు చేసింది.ఈ అదనపు విలువ(లాభాల) కోసం పెట్టుబడిదారులు ఉత్పత్తిని నిరంతరం విస్తరించడానికి ప్రయత్నిస్తారు.అదే సమయంలో కార్మికుల శ్రమను మరింత తీవ్రంగా వినియోగించేందుకు ప్రయత్నిస్తారు.దీంతో పెట్టుబడిదారీ వ్యవస్థలో ఒక వైరుధ్యం ఏర్పడుతుంది. ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది.సంపద పెరుగుతుంది. కానీ ఆ సంపద సమాజమంతటికీ సమానంగా చేరదు.అది కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుంది.అసమానతలకు దారితీస్తుంది. ఈ ధోరణి నేడు ప్రపంచవ్యాప్తంగా మరింత స్పష్టంగా కనిపిస్తోంది.ఇలాంటి పరిస్థితులను ముందుగానే విశ్లేషించిన దార్శనికుడు మార్క్స్‌. మార్క్స్‌ ఆలోచనలు 19వ శతాబ్దంలో సిద్ధాంత రూపంలో వెలుగులోకి వచ్చాయి.20వ శతాబ్దం నాటికి అవి రాజకీయ శక్తిగా రూపుదిద్దు కున్నాయి.ఆ మార్పునకు ప్రధాన కారణం లెనిన్‌. మార్క్స్‌ తరువాత ఆయన ఆలోచనలను మరింత ముందుకు తీసుకెళ్లిన వారిలో లెనిన్‌ అత్యంత ముఖ్యుడు. లెనిన్‌ పెట్టుబడిదారీ వ్యవస్థలో వచ్చిన కొత్త మార్పులను విశ్లేషించాడు.పారిశ్రామిక పెట్టుబడి,బ్యాంకింగ్‌ పెట్టుబడి కలిసిపోవడం వల్ల ”ఫైనాన్స్‌ కేపిటల్‌” ఏర్పడుతుందని ఆయన వివరించాడు.ఈ ఫైనాన్స్‌ కేపిటల్‌ ప్రపంచ మార్కెట్లను ఆక్రమించడానికి పోటీ పడుతుంది.కొత్త మార్కెట్లు,వనరులు,పెట్టుబడి అవకాశాల కోసం దేశాలు పరస్పరం పోటీ పడతాయి.ఈ పోటీ ప్రపంచ రాజకీయాలను ఉద్రిక్తతలతో నింపుతుంది. చివరకు యుద్ధాలకు దారితీస్తుంది. లెనిన్‌ ఈ దశను ”పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క అత్యున్నత దశ- సామ్రాజ్యవాదం”గా నిర్వచించాడు. ఈ నేపథ్యంలోనే 1917లో జరిగిన రష్యన్‌ విప్లవం (Russian Revolution) ప్రపంచ చరిత్రలో ఒక మహత్తర మలుపుగా నిలిచింది.లెనిన్‌ సారథ్యంలో రష్యాలో కార్మికవర్గం జార్‌ రాజ్యాన్ని కూల్చివేసింది. ఒక కొత్త సామాజిక వ్యవస్థ(సోషలిజం)ను నిర్మించేందుకు విప్లవాత్మక ప్రయోగం ప్రారంభమైంది. ఈ విప్లవం ప్రపంచ కార్మిక ఉద్యమాలకు అపూర్వమైన ప్రేరణను ఇచ్చింది.ఈ ప్రభావం కేవలం యూరప్‌కే పరిమితం కాలేదు.ఆసియా,ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలలో వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్య్ర ఉద్యమాలను కూడా తాకింది.సామాజిక న్యాయం,కార్మిక హక్కులు,సంక్షేమ విధానాల వంటి అంశాలు ప్రపంచ రాజకీయాల్లో ముఖ్యమైన చర్చలుగా మారాయి.ఇది మార్క్స్‌ ఆలోచనల శక్తిని సూచించే ఒక చారిత్రక దశ.కానీ చరిత్ర ఎప్పుడూ సూటిగా ముందుకు సాగదు. సోషలిస్టు ప్రయోగాలు విజయాలు,వైఫల్యాలు రెండింటినీ అనుభవించాయి.అనేక దేశాల్లో రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి.పలు అంతర్గత సమస్యలు, బాహ్య ఒత్తిడులు,రాజకీయ సంక్లిష్టతలతో సోషలిస్టు దేశాలు అనేక సవాళ్లను ఎదుర్కొన్నాయి.కొన్ని సోషలిస్టు వ్యవస్థలు కూలిపోయాయి కూడా. అయితే ఆ పరిణామాల ఆధారంగా మార్క్సిజానికి కాలం చెల్లిందని చెప్పడం సత్యదూరమే అవుతుంది.ఎందుకంటే మార్క్స్‌ విశ్లేషించిన పెట్టుబడిదారీ వ్యవస్థలోని వైరుధ్యాలు ఇంకా అదృశ్యమవలేదు. అవి నేటి ప్రపంచంలో మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి.మార్క్సిజం యొక్క నిజమైన బలం ఏమిటంటే అది సమాజాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడగలిగే చూపునిస్తుంది.సమాజంలోని సమస్యలను వ్యక్తుల వైఫల్యాలుగా కాకుండా వ్యవస్థలోని వైరుధ్యాలుగా చూడాలని సూచిస్తుంది.ఈ దృష్టికోణమే ఆధునిక సామాజిక శాస్త్రాల అభివృద్ధికి కూడా పునాది వేసింది. ఆర్థిక శాస్త్రం,రాజకీయ శాస్త్రం,చరిత్ర,సామాజిక శాస్త్రం,ఇలా అనేక రంగాలలో మార్క్స్‌ ఆలోచనలు ప్రభావం చూపాయి.మార్క్స్‌ కేవలం తన కాలాన్ని మాత్రమే కాదు,తనకు ముందు,తర్వాత కాలాలను కూడా అర్థం చేసుకునే శాస్త్రీయమైన ఆలోచనలను అందించాడు.అందుకే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా రూపుదిద్దు కుంటుంది? ఎలా విస్తరిస్తుంది? పెట్టుబడి ఎలా కేంద్రీకృతమవుతుంది? దేశాల మధ్య పోటీ ఎలా తీవ్రమవుతుంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ మార్క్స్‌ నిలువెత్తు సమాధానంగా నిలిచివున్నాడు. వర్తమాన పరిస్థితులను గమనిస్తే మార్క్స్‌ విశ్లేషించిన ధోరణులు ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో అర్థమవుతుంది.ప్రపంచ సంపదలో అత్యధిక భాగం కొద్దిమంది బిలియనీర్ల చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది.అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు అనేక దేశాల ప్రభుత్వాల కంటే ఎక్కువ ఆర్థికశక్తిని సంపాదించాయి.టెక్నాలజీ సంస్థలు,ఫైనాన్స్‌ సంస్థలు,గ్లోబల్‌ పెట్టుబడులు ప్రపంచ మార్కెట్లను శాసిస్తున్నాయి.పెట్టుబడి సరిహద్దులను దాటి సంచరిస్తున్నప్పటికీ,దాని లాభాలు మాత్రం సమాజమంతటికీ సమానంగా చేరడం లేదు.ఈ ధోరణి ప్రపంచ రాజకీయాల్లో కూడా కనిపిస్తోంది. వనరులు,మార్కెట్లు,భౌగొళిక ప్రాధాన్యతలపై ఆధిపత్యం కోసం శక్తివంతమైన దేశాలు పరస్పరం పోటీ పడుతున్నాయి.అనేక ప్రాంతాలు ఈ ఆధిపత్య పోటీకి వేదికలుగా మారుతున్నాయి. యుద్ధాలు,ఆంక్షలు,సైనిక కూటములు,వ్యూహాత్మక ఒప్పందాలు..ఈ పరిణామాలన్నిటినీ గమనిస్తే ఒక సత్యం బోధపడుతుంది.యుద్ధాలు కేవలం రాజకీయ నాయకుల ఆకస్మిక నిర్ణయాల వల్ల రావు.అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని లోతైన వైరుధ్యాల నుంచి పుడతాయి.పెట్టుబడిదారీ వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ మార్కెట్ల కోసం పోటీ పెరుగుతుంది.ఆ ఆధిపత్య పోటీ ఫలితంగానే నేడు ఒకవైపు పశ్చిమాసియా మంటల్లో కాగుతుండగా,మరోవైపు యూరప్‌ తీవ్ర ఉద్రిక్తలకు కేంద్రంగా మారింది.ప్రపంచ రాజకీయాల ఈ దిశను మార్క్స్‌ తన కాలంలోనే గుర్తించాడు.అందుకే నేటి ప్రపంచ పరిణామాలను అర్థం చేసుకోవాలంటే మార్క్స్‌ను మనం తిరిగి చదవాల్సిన అనివార్యత స్పష్టంగా కనిపిస్తోంది.ఒక వ్యక్తి ఆలోచనలు ఇలా శతాబ్దాల పాటు ప్రపంచాన్ని ప్రభావితం చేయడం సాధారణ విషయం కాదు. అది సాధ్యమవ్వాలంటే ఆ ఆలోచనలు కాలాన్ని మించిన శక్తిని కలిగి ఉండాలి.మానవ చరిత్రను ముందుకు నడిపించే శక్తులతో అనుసంధానమై ఉండాలి.మార్క్స్‌ ఆలోచనలు అలాంటివే.అందుకే,ఒక సమాజం న్యాయసమ్మతంగా,సమానత్వంతో కూడినదిగా మారాలని పోరాడే ప్రతి ఉద్యమంలో మార్క్స్‌ ప్రతిధ్వని వినిపిస్తుంది.ప్రపంచం మళ్లీ యుద్ధాల అంచులపై నిలిచిన ఈ సమయంలో ఆ ప్రతిధ్వని మరింత స్పష్టంగా గర్జిస్తోంది.శాంతి,ప్రజాస్వామ్యం,మానవహక్కుల పేరుతో సాగుతున్న రాజకీయాల వెనుక,వాటి ఫలితంగా తలెత్తుతున్న యుద్ధాల వెనుక దాగి ఉన్న అసలు శక్తులను అర్థం చేసుకోవాలంటే సమాజాన్ని వాస్తవాల ఆధారంగా విశ్లేషించే శాస్త్రీయ దృక్పథం అవసరం.ఆ దృక్పథాన్ని మనకు అందించిన మహోపాధ్యాయుడు కార్ల్‌మార్క్స్‌.మార్క్స్‌ ఒక వ్యక్తి కాదు,సమాజాన్ని కదిలించే శక్తి,మార్క్స్‌ ఒక కాలం కాదు,ఒక చారిత్రక ప్రవాహం..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News