కండ్లు మూసుకున్న కార్పొరేషన్ అధికారులు..
కండ్లు మూసుకున్న కార్పొరేషన్ అధికారులు..
NM Yadav
నాలా ‘క్లీన్’ చేయకుండానే స్లాబ్ వేస్తారా?
కాంట్రాక్టర్ నిర్వాకంపై 24వ డివిజన్ ప్రజల ఆగ్రహం..
ప్రకాశం బజార్‌లో పనులు అడ్డుకున్న స్థానికులు, యువత..
విద్యుత్ స్తంభం తొలగించకుండానే మమ అనిపిస్తున్న వైనం..
నల్లగొండ : పనుల్లో నాణ్యత లేదు.. ప్రజా సమస్యలపై పట్టింపు లేదు.. కేవలం టార్గెట్లు పూర్తి చేసుకొని బిల్లులు డ్రా చేసుకోవడమే పరమావధిగా భావిస్తున్న ఓ మున్సిపల్ కాంట్రాక్టర్ తీరుపై నల్లగొండ మున్సిపాలిటీ 24వ డివిజన్ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైనేజీ నాలాలో పేరుకుపోయిన మురికి, బురద, ఒండ్రుమట్టిని కనీసం శుభ్రం చేయకుండానే.. పైన స్లాబ్ వేసేందుకు కాంట్రాక్టర్ ప్రయత్నించడం స్థానికంగా తీవ్ర దుమారం రేపింది. కాంట్రాక్టర్ ముసుగులో జరుగుతున్న ఈ దగాను గమనించిన స్థానిక ప్రజలు, యువకులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. కాంట్రాక్టర్‌ను నిలదీయడంతో ఘటనా స్థలంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
సమస్యను మూసిపెడతారా? పరిష్కరిస్తారా?
స్థానికుల కథనం ప్రకారం.. 24వ డివిజన్ పరిధిలోని ప్రకాశం బజార్, ఎగ్బాల్ మినార్ ఎదురుగా ఉన్న ప్రధాన నాలా మధ్యలో ఒక విద్యుత్ స్తంభం ఉంది. దీని కారణంగా నాలాలో మురుగు నీటి ప్రవాహం పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఎక్కడికక్కడ మురికి, ఒండ్రుమట్టి పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈ ప్రధాన సమస్యను పరిష్కరించాల్సింది పోయి.. సదరు కాంట్రాక్టర్ ఆ బ్లాకేజీని అలాగే ఉంచి, నాలాపై స్లాబ్ పనులు ప్రారంభించాడు. నాలాను శుభ్రం చేయకుండా స్లాబ్ వేయడం అంటే సమస్యను పరిష్కరించడం కాదు.. శాశ్వతంగా మూసిపెట్టడమే అంటూ వార్డు ప్రజలు మండిపడ్డారు.
వర్షాకాలం వస్తే ఇళ్లల్లోకి మురుగు నీరేనా..
త్వరలోనే వర్షాకాలం ప్రారంభం కానుండటంతో.. డ్రైనేజీ పూర్తిగా మూసుకుపోతే మురుగు నీరంతా ఇళ్లల్లోకి వస్తుందని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్ తీసుకున్న నాటి నుంచి తలా తోకా లేని పనులు చేస్తున్నాడని, ప్రజల ఇబ్బందులు పట్టవా? అంటూ ధ్వజమెత్తారు. స్థానిక కౌన్సిలర్‌కు సైతం ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఈ పనులు కానిచ్చేయాలని చూడటం వెనుక అంతర్యమేమిటని విమర్శిస్తున్నారు. నాణ్యత లేని నిర్మాణాలతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు.
ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి డిమాండ్..
వెంటనే ఈ అసంపూర్తి పనులను నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. విద్యుత్ స్తంభాన్ని తొలగించి, నాలాను పూర్తి స్థాయిలో శుభ్రపరిచిన తర్వాతే కొత్తగా శాస్త్రీయ పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని పట్టుబట్టారు. మున్సిపల్ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఘటనా స్థలాన్ని పరిశీలించాలని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని 24వ వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి