కాంగ్రెస్ గుండాల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
కాంగ్రెస్ గుండాల హత్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
Biksham
మధు హత్య కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట మండలం యర్కారం గ్రామంలో హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు మృతదేహానికి మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
మధు హత్యను కాంగ్రెస్ గుండాల దారుణ చర్యగా అభివర్ణించిన జగదీష్ రెడ్డి, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించడం అత్యంత ప్రమాదకరమని అన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం నెలకొన్నదని, శాంతిభద్రతల విషయంలో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు పెరిగాయని, పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ గుండాల ఆధీనంలో నడుస్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ నాయకులను స్టేషన్లకు పిలిపించి అవమానాలకు గురిచేస్తున్నారని, ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజాప్రతినిధులను కూడా వేధిస్తున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న హత్య కేసులో సాక్షులను బెదిరించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు.
ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను అకస్మాత్తుగా మార్చడం వెనుక కుట్ర ఉందని, కేసును బలహీనపర్చడానికే ఆ చర్య చేపట్టారని అన్నారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా హత్య చేశారని, ఈ ఘటనకు కాంగ్రెస్ నాయకులు మరియు కొందరు పోలీసు అధికారులు బాధ్యులని ఆరోపించారు.
కేసు దర్యాప్తును బీఆర్ఎస్ పార్టీ నిశితంగా గమనిస్తుందని, నిజమైన నిందితులను గుర్తించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దర్యాప్తులో తప్పుదోవ పట్టించే అధికారులను వదిలిపెట్టబోమన్నారు.
మధు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, ఆయన ఇద్దరు కుమార్తెల చదువులు మరియు కుటుంబ పోషణ బాధ్యతను పార్టీ తీసుకుంటుందని జగదీష్ రెడ్డి ప్రకటించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి