గిరిజన పల్లెల్లో కలెక్టర్ సందడి పదేళ్ల తర్వాత పొగిళ్ల గ్రామాన్ని సందర్శించిన జిల్లా స్థాయి అధికారి..
గిరిజన పల్లెల్లో కలెక్టర్ సందడి పదేళ్ల తర్వాత పొగిళ్ల గ్రామాన్ని సందర్శించిన జిల్లా స్థాయి అధికారి..
NM Yadav
భూ సమస్యల పరిష్కారానికి పక్కా ప్రణాళిక..
ఏప్రిల్ 15 నుంచి 'పొగిళ్ల' భూముల సర్వే..
అమ్మ ఆదర్శ పాఠశాల పనులపై దిశానిర్దేశం..
నల్గొండ : మారుమూల గిరిజన ప్రాంతాలైన పొగిళ్ల, కంబాలపల్లి గ్రామాల్లో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు. సుమారు పదేళ్ల తర్వాత ఓ జిల్లా కలెక్టర్ స్థాయి అధికారి తమ గ్రామానికి రావడంతో గిరిజన రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డితో కలిసి ఆయా గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు.
క్షేత్రస్థాయిలో సమస్యల పరిశీలన..
ముందుగా పొగిళ్ల గ్రామానికి చేరుకున్న కలెక్టర్ ఇందిరమ్మ ఇళ్లు, పాఠశాల వసతులను స్వయంగా పరిశీలించారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి విద్యార్థులతో తెలుగు శతకాలు, పద్యాలను చదివించారు. యూనిఫాం ధరించాలని సూచిస్తూనే విద్యార్థులు మధ్యలో బడి మానకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. 'అమ్మ ఆదర్శ పాఠశాల' నిధులతో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.
భూ సమస్యపై స్పష్టత ఏప్రిల్ 15 నుంచి సర్వే..
పొగిళ్లలోని సర్వే నంబర్ 2లో ఉన్న 1,056 ఎకరాల భూమిపై నెలకొన్న గందరగోళంపై కలెక్టర్ రైతులకు క్లారిటీ ఇచ్చారు. కంబాలపల్లిలో ప్రస్తుతం కొనసాగుతున్న మోకా సర్వే పూర్తి కాగానే, ఏప్రిల్ 15 నుండి పొగిళ్లలో ప్రత్యేక సర్వే బృందాలతో సర్వే ప్రారంభిస్తామన్నారు. ప్రస్తుత పట్టాలు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం జాబితాను పంచాయతీ నోటీసు బోర్డులో పెడతామని అభ్యంతరాల పరిష్కారం తర్వాతే 'భూభారతి' ద్వారా అర్హులైన రైతులకు పట్టాలు ఇస్తామని ప్రకటించారు.
సంక్షేమ పథకాలు స్వయం ఉపాధి..
మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం సెరికల్చర్, కిరాణా, టెంట్ హౌస్ వంటి వ్యాపారాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తుందని వీటిని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. అలాగే వివాదాల కారణంగా నిలిచిపోయిన గ్రామ సమాఖ్య భవన నిర్మాణాన్ని తక్షణం ప్రారంభించాలని పంచాయతీరాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల హాజరు, పౌష్టికాహారాన్ని పరిశీలించిన కలెక్టర్ కేంద్రంలో ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటుకు ఆదేశాలిచ్చారు. అనంతరం పల్లె దవఖానాను సందర్శించి వైద్య సేవలను ఆరా తీశారు. తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రిఫర్ చేయాలని సూచించారు.
కంబాలపల్లిలో జాయింట్ సర్వేకు ఆదేశం..
కంబాలపల్లి రైతు వేదికలో ప్రజలతో మాట్లాడిన కలెక్టర్.. సర్వే నంబర్ 37, 50లలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ భూముల సరిహద్దులపై తహసీల్దార్ శ్రీధర్ బాబు జాయింట్ సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతులకు 'ఇందిరా జలప్రభ' కింద బోర్లు, సోలార్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో డీపీఓ శంకర్ నాయక్, డీఈఓ భిక్షపతి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి, తహసీల్దార్ శ్రీధర్ బాబు, సర్పంచులు జటావత్ జయేందర్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి