ఎస్‌ఐహెచ్‌ఎంను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం :మంత్రి జూపల్లి కృష్ణారావు
ఎస్‌ఐహెచ్‌ఎంను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేస్తాం :మంత్రి జూపల్లి కృష్ణారావు
Krishna
జహీరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్‌లో ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా జహీరాబాద్‌లోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఐహెచ్‌ఎం) సంస్థలో నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను ప్రారంభించడంతో పాటు నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన బీబీఏ, ఎంబీఏ కోర్సుల అడ్మిషన్లను లాంఛనంగా ప్రారంభించి, పర్యాటక శాఖ రూపొందించిన ‘టూరిస్ట్ గైడ్’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న ఎస్‌ఐహెచ్‌ఎంను పునఃప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతలో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి వారిని స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు రూ.5 కోట్లు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని పేర్కొన్నారు. ఎస్‌ఐహెచ్‌ఎంలో చేరే పేద విద్యార్థులకు ఆర్థిక భారం లేకుండా స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు.ప్రస్తుత కాలంలో పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు ఉన్నాయని, యువత వృత్తిపరమైన కోర్సులతో పాటు భాషా నైపుణ్యాలను కూడా అభివృద్ధి చేసుకోవాలని మంత్రి సూచించారు. విదేశీ భాషలు నేర్చుకోవడం ద్వారా దేశ విదేశాల్లో మరిన్ని అవకాశాలు లభిస్తాయని తెలిపారు. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు కూడా వారిని ఉపాధి ఆధారిత కోర్సుల వైపు ప్రోత్సహించాలని కోరారు. ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ మాట్లాడుతూ గ్రామీణ యువతకు నాణ్యమైన శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిథమ్ డైరెక్టర్ వెంకట రమణతో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి