ధాన్యం కొనాల్సిందే.. అన్నదాతల ఆగ్రహం!
ధాన్యం కొనాల్సిందే.. అన్నదాతల ఆగ్రహం!
NM Yadav
నల్గొండ కలెక్టరేట్ ఎదుట బిఆర్ఎస్ రైతు మహాధర్నా సక్సెస్..
కాంగ్రెస్ హయాంలో మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి..
సీఎం రేవంత్ రివ్యూలన్నీ రియల్ ఎస్టేట్ కోసమే ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్..
తరలివచ్చిన రైతాంగం, గులాబీ శ్రేణులు..
నల్గొండ : రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లను తక్షణమే వేగవంతం చేయాలని, రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ 'రైతు మహాధర్నా' నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి రైతులు, బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కలెక్టరేట్ పరిసరాలు హోరెత్తాయి. ధర్నాలో మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు.
నాడు రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్నాం.. జగదీష్ రెడ్డి
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు సమైక్య రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలే నేడు తెలంగాణలో కాంగ్రెస్ పాలనలో మళ్లీ పునరావృతమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో స్వర్ణయుగం.. నల్గొండను పట్టి పీడించిన ఫ్లోరైడ్ భూతాన్ని మిషన్ భగీరథ పథకం ద్వారా కేసీఆర్ తరిమికొట్టారని గుర్తుచేశారు. 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీరు, పెట్టుబడి సాయం అందించి రైతులను కడుపులో పెట్టుకుని చూసుకున్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆనాడు కేంద్రం వడ్లు కొనకపోతే ఢిల్లీ వేదికగా ధర్నా చేసి మరీ ధాన్యం సేకరించి, రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించామన్నారు. చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగిస్తూ రైతులను ఏడిపిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, హెలికాప్టర్లు లేనిదే ఆయన కాలు కదపడం లేదని విమర్శించారు. జిల్లా మంత్రులు, మిల్లర్లు కుమ్మక్కై రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని, వడ్లలో తరుగు తీస్తామంటే రైతులు ఊరుకోరని హెచ్చరించారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో జిల్లాలో రోజుకు 500 కిలోమీటర్లు కారులో తిరుగుతూ రోజుకు మూడు సార్లు సమీక్షలు జరిపి ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేవాడినని, నేడు ఒక్క మంత్రి కూడా క్షేత్రస్థాయిలో కనపడటం లేదన్నారు. మోదీ, చంద్రబాబు కలిసిన హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీకి సంచులు మోయడమే సీఎం పని: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..
బిఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను రోజుకు 18 గంటలు రివ్యూలు చేస్తున్నానని సీఎం చెప్తున్నారు కానీ ఆ సమీక్షలన్నీ కేవలం రియల్ ఎస్టేట్ లాభాల కోసమే తప్ప రైతుల కోసం కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లాభాలు వస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ రైతుల నడుము విరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి డబ్బు సంచులు మోయడానికే పరిమితమయ్యారు. ప్రధాని మోదీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి రైతుల సమస్యల గురించి కాకుండా, మూసీ సుందరీకరణ, రియల్ ఎస్టేట్ అంశాల గురించే అడిగారని ఆరోపించారు.
కేంద్రం మెడలు వంచి, ఇందిరా పార్క్, ఢిల్లీ వేదికగా ధర్నాలు చేసి ధాన్యం కొనిపించిన చరిత్ర కేసీఆర్‌దేనని స్పష్టం చేశారు. అలాగే, రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై సీఎం డ్రామాలు ఆడుతున్నారని, బీజేపీ నేతలను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కన్నీళ్లకు కారణమైన ఈ ప్రభుత్వం కూలిపోవడం, మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై సాగిన ఈ మహాధర్నాలో మాజీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, ఒంటెద్దు నర్సింహారెడ్డితో పాటు భారీ సంఖ్యలో రైతులు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి