బిచ్కుందలో కాంగ్రెస్ గర్జన – భారీ రోడ్ షోతో ఉత్సాహం
బిచ్కుందలో కాంగ్రెస్ గర్జన – భారీ రోడ్ షోతో ఉత్సాహం
Krishna
బిచ్కుంద మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది అభ్యర్థులతో కలిసి బిచ్కుంద పట్టణంలో భారీ రోడ్ షో నిర్వహించారు.ఈ ప్రచార కార్యక్రమానికి మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి మంత్రికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ జన్మదినాన్ని పురస్కరించుకొని కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు మరియు బిచ్కుంద ప్రజలతో కలిసి భారీ రోడ్ షోగా పట్టణం గుండా ముందుకు సాగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ బిచ్కుంద బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో మంత్రి అజారుద్దీన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిచ్కుంద మున్సిపాలిటీలో ఉన్న 12 వార్డుల్లో 12కి 12 కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధికి పట్టుదలతో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్న నాయకుడు తోట లక్ష్మీ కాంతారావు అని కొనియాడారు. ప్రజలందరూ ఆయన వెంట నడుస్తూ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.అనంతరం ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ సమావేశానికి భారీ సంఖ్యలో తరలివచ్చి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నుంచి లభించిన విపరీతమైన స్పందనను చూసి బిచ్కుంద మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 12 మంది కాంగ్రెస్ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతుంటే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డంకులు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇటీవల బిచ్కుందకు వచ్చిన కేటీఆర్, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే బిచ్కుంద మున్సిపాలిటీని రద్దు చేస్తామని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అధిక నిధులు తీసుకొచ్చి బిచ్కుందను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని, ప్రతి వార్డులో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపాలని తాము కృషి చేస్తున్నామని చెప్పారు.
కానీ బిచ్కుంద గానీ, జుక్కల్ నియోజకవర్గం గానీ అభివృద్ధి చెందడం ఇష్టం లేని బీఆర్ఎస్ నాయకులు ఇలా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.ఎవరెన్ని కుట్రలు చేసినా బిచ్కుందను ఒక మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్ది అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందిస్తానని హామీ ఇచ్చారు.అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తన గెలుపును కించపరుస్తూ మాట్లాడటం పూర్తిగా అహంకారానికి నిదర్శనమని అన్నారు.2009లో కేటీఆర్ మొదటిసారి ఎన్నికల్లో చాలా తక్కువ ఓట్ల తేడాతో గెలిచిన విషయాన్ని గుర్తుచేశారు.అలాంటి వ్యక్తి నేడు బిచ్కుందకు వచ్చి తన మెజారిటీ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించని వ్యక్తి నిజమైన నాయకుడు కాదని వ్యాఖ్యానించారు. మోసపూరిత మాటలు నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, బీఆర్ఎస్ నాయకుల అవినీతి చరిత్ర ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. గత ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనమని అన్నారు.అందువల్ల బిచ్కుంద ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని, బిచ్కుంద మున్సిపాలిటీ అభివృద్ధి పూర్తి బాధ్యత తానే తీసుకుంటానని సభాముఖంగా హామీ ఇచ్చారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి