ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్..
ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్ట్..
NM Yadav
రూ. లక్ష విలువైన గంజాయి, కత్తులు, బైక్ స్వాధీనం
'మిషన్ పరివర్తన్'లో భాగంగా కనగల్ పోలీసుల ఘనత..
వివరాలు వెల్లడించిన నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి..
నల్గొండ : తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా నల్లగొండ జిల్లా పోలీసులు భారీ విజయం సాధించారు. నల్లగొండ జిల్లా ఎస్పీ శ్రీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో సాగుతున్న 'మిషన్ పరివర్తన్' లో భాగంగా కనగల్ పోలీసులు అక్రమంగా గంజాయి రవాణా మరియు విక్రయాలు జరుపుతున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి సుమారు రూ. లక్ష విలువైన 2.2 కేజీల గంజాయి, 2 కత్తులు, 3 సెల్ ఫోన్లు మరియు ఒక పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం (మే 14) సాయంత్రం 3:30 గంటల ప్రాంతంలో కనగల్ మండల పరిధిలోని జి.ఎల్ గార్డెన్ వెనుక వైపు ఉన్న వేప చెట్టు కింద కొందరు వ్యక్తులు గంజాయి పంచుకుంటున్నారని పోలీసులకు నమ్మదగిన సమాచారం అందింది. చండూర్ సీఐ టి. రాము పర్యవేక్షణలో కనగల్ ఎస్ఐ కే. రాజీవ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని ఆకస్మిక దాడి జరిపారు. ఒక మోటార్ సైకిల్‌తో ఉండి గంజాయిని పంపిణీ చేసుకుంటున్న ఐదుగురు నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసుల విచారణలో పట్టుబడిన నిందితులు కనగల్ మండలానికి చెందిన వారిగా గుర్తించారు. బొడ్డు చందు (19) (కూలీ, నివాసం: జి. యడవెల్లి), కానుగు సాయిరామ్ (24) (వ్యవసాయం, నివాసం: యడవెల్లి), జిల్లా చందు (23) (బైక్ మెకానిక్, నివాసం, యాడవెల్లి), చాడ క్రాంతికుమార్ (23) (కూలీ, నివాసం: పొనుగోడు), బొమ్మరగోని అంజి అలియాస్ నిరంజన్ (19) (విద్యార్థి, నివాసం: జి. యడవెల్లి ).
హైదరాబాద్ టూ నల్లగొండ.. మూడు నెలలుగా దందా..
నిందితులను లోతుగా విచారించగా వారు గత మూడు నెలలుగా ఈ అక్రమ గంజాయి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు ఒప్పుకున్నారు. హైదరాబాద్‌లోని ధూల్‌పేట్‌కు చెందిన 'మన్నీ' అనే మహిళ నుండి ఈ గంజాయిని కొనుగోలు చేసి, ఇక్కడికి తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు తేలింది. నిందితుల నుంచి గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన పల్సర్ బైక్ (TS-05-FC-3372) ను సీజ్ చేశారు. నిందితులపై కనగల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నం: 86/2026 కింద NDPS యాక్ట్ మరియు ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.
గంజాయి సమాచారం కోసం 'కంట్రోల్ రూమ్' ఏర్పాటు..
జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ఎస్పీ కార్యాలయంలో ప్రత్యేకంగా 'GANJA POLICE CONTROL ROOM' ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక ఫోన్ నంబర్ 8712670266 ను అందుబాటులోకి తెచ్చారు. జిల్లా ప్రజలు ఎవరైనా గంజాయి సాగు, రవాణా, విక్రయాలపై ఈ నంబర్‌కు సమాచారం అందించవచ్చని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఆయన స్పష్టం చేశారు. సమాచారం అందిన వెంటనే స్పందించి నిందితులను పట్టుకున్న కనగల్ ఎస్ఐ కే. రాజీవ్ రెడ్డి, సిబ్బంది రమేష్, సురేష్, విజయ్ శేఖర్, రవీందర్ రెడ్డి, వెంకన్న, వీరయ్య, వెంకట్ రెడ్డి, గోపిలను నల్లగొండ డీఎస్పీ కె. శివరాం రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి